
విద్యార్థులను తీర్చిదిద్దాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
తాడ్వాయి : విద్యార్థులను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులే తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఆయన మంగళవారం తాడ్వాయితో పాటు దేవాయిపల్లి గ్రామంలో పర్యటించారు. ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ కేంద్ర భవనం, వంటగది, ప్రహరీ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కుండీలలో నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. నిబంధనలకు అనుగుణంగానే ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. మొదటి విడత బిల్లులు త్వరలోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ అవుతాయన్నారు.
అనంతరం ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటి, నీళ్లు పోశారు. దేవాయిపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. ఆయన వెంట డీఈవో రాజు, హౌజింగ్ డీఈ సుభాష్, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, తహసీల్దార్ శ్వేత, ఎంపీవో సవిత, ఏపీవో కృష్ణగౌడ్, ఏపీఎం మనోహర్, ఎంఈవో రామస్వామి, హెచ్‌ఎం కళ్యాణి, కార్యదర్శి బాలు తదితరులు ఉన్నారు.