
రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు
లింగంపేట(ఎల్లారెడ్డి): ప్రైవేటు ఫర్టిలైజర్ దుకాణాల్లో మందులు విక్రయించే సమయంలో రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవని విద్యుత్ వినియోగదారుల ఫోరం సభ్యులు రాజాగౌడ్ హెచ్చరించారు. శుక్రవారం లింగంపేట రైతు వేదికలో భారతీయ కిసాన్ సంఘ్(బీకేఎస్) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడారు. డీఏపీ, యూరియా బస్తాలు ప్రతి ఫర్టిలైజర్ షాపులో స్టాక్ వివరాలు ప్రదర్శించాలన్నారు. లింగంపేటలోని ఓ దుకాణం యజమాని రైతులు కొనుగోలు చేస్తున్న డీఏపీకి కార్బన్ ప్యాకెట్లు కొంటేనే ఇస్తామని చెప్పడం సరికాదన్నారు. అలాగే ఎల్లారెడ్డిలోని గ్రోమోర్ సెంటర్‌లో రైతులకు అవసరం లేని మందులు బలవంతంగా అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా వ్యవసాయాధికారికి వివరించగా.. రైతులకు బలవంతంగా కార్బన్ ప్యాకెట్లు అంటగడితే వెంటనే ఆ దుకాణాన్ని సీజ్ చేస్తామని చెప్పారని అన్నారు. బీకేఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్, మండల అధ్యక్షుడు సాయిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.