
జిల్లాలో హాట్ టాపిక్‌గా ‘ఫోన్ ట్యాపింగ్’
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్రంలో రాజకీయ దుమారం లేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కామారెడ్డిలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. స్థానికంగా పలువురు నేతలకు ప్రత్యేక దర్యాప్తు బృందం పోలీసు అధికారులు ఫోన్లు చేసి ట్యాపింగ్ జరిగిన విషయంలో వాంగ్మూలం ఇవ్వడానికి రావాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కామారెడ్డి హాట్‌సీట్‌గా మారిపోయింది. ఆ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు ఇద్దరు కీలక నేతలను కాదని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డిని గెలిపించారు. అయితే ఎన్నికల సమయంలో కామారెడ్డి కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున జరిగిందన్న ప్రచారం జరిగింది. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు కామారెడ్డికి చెందిన పలువురికి ఫోన్‌లు చేసి ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సమాచారం కోసం పిలుస్తున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాది, కాంగ్రెస్ లీగల్ సెల్ నాయకుడు దేవరాజ్‌గౌడ్‌కు సిట్ అధికారుల నుంచి ఫోన్ రాగా ఆయన మూడు నాలుగు రోజుల్లో వస్తానని వారికి సమాచారం ఇచ్చారు. అలాగే ఇటీవలే పీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గడ్డం చంద్రశేఖర్‌రెడ్డికి కూడా సిట్ అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. ఆయనతో పాటు మరో ఎనిమిది మందికి కూడా అధికారులు ఫోన్ చేసి హైదరాబాద్‌కు రావాలని సూచించారు. ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయన్న అంశంపై వివరాలు సేకరించిన పోలీసులు వారిని వాంగ్మూలంకోసం పిలుస్తున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం 11 గంటలకు సిట్ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వనున్నట్లు గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి ‘సాక్షి’తో తెలిపారు.
బాధితులు ఎందరో..
జిల్లాలో ఫోన్ ట్యాపింగుకు గురైనవారు ఎందరున్నారో అన్న చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర రాజకీయాలన్నీ కామారెడ్డి నియోజకవర్గం చుట్టే తిరిగాయి. అప్పటి సీఎం కేసీఆర్‌ను ఓడిస్తానంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి చాలెంజ్ చేసి వచ్చి బరిలో నిలిచారు. ఇద్దరు ఉద్దండులను వెంకటరమణారెడ్డి ఓడించడం అప్పట్లో సంచలనం కలిగించింది. కాగా కామారెడ్డిలో ఎందరి ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయన్న దానిపై చర్చ నడుస్తోంది. సిట్ అధికారుల వద్ద ఉన్న జాబితాలో ఉన్న వారికి ఫోన్లు వస్తుండడంతో ఇంకా ఎవరెవరున్నారోనని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.
పలువురికి సిట్ అధికారుల
నుంచి ఫోన్లు
కాంగ్రెస్ లీగల్ సెల్ నేత దేవరాజ్‌గౌడ్, పీసీసీ ప్రధాన కార్యదర్శి
చంద్రశేఖర్‌రెడ్డిలకు పిలుపు