కామారెడ్డి టౌన్: ఎసెస్సీ వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 4వ తేదీ వరకు కొనసాగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లాలో 12,579 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందులో 6,127 మంది బాలురు, 6,452 మంది బాలికలున్నారు. వీరి కోసం జిల్లావ్యాప్తంగా 64 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఏ కేటగిరీలో 17, బీలో 35, సీలో 12 కేంద్రాలున్నాయి. పరీక్షల నిర్వహణ కోసం 64 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 64 మంది డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 22 మంది కస్టోడియన్‌లు, 22 మంది జాయింట్ కస్టోడియన్‌లు, 12 మంది సీ సెంటర్ కస్టోడియన్‌లు, ముగ్గురు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 12 మంది సిట్టింగ్స్ స్క్వాడ్స్, 699 మంది ఇన్విజిలెటర్లను నియమించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక ఏఎన్‌ఎం, కానిస్టేబుల్ అందుబాటులో ఉండనున్నారు.
ఐదు నిమిషాల వరకు అనుమతి
ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభమయ్యాక ఐదు నిమిషాల వరకే కేంద్రం లోనికి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రానికి చుట్టుపక్కల 100 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉండనుంది. పరీక్ష కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ సెంటర్లను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం వరకు మూసి ఉంచాలని అధికారులు సూచించారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ కామారెడ్డి డిపో మేనేజర్ ఇందిర తెలిపారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే కంట్రోల్ రూం ( 90326 95219)లో సంప్రదించాలని అధికారులు సూచించారు.
తొలిసారిగా క్యూఆర్ కోడ్‌తో..
పరీక్ష పత్రాలు లీక్ కాకుండా విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది. తొలిసారిగా ప్రశ్నపత్రంతోపాటు జవాబు పత్రంపైనా క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఒకవేళ ప్రశ్నపత్రం లీక్ అయినా ఏ సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందో తెలిసే అవకాశం ఉంటుంది. ఈ విధానంతో ఏ విద్యార్థికి సంబంధించిన ప్రశ్నపత్రం, ఏ సెంటర్ నుంచి బయటకు వచ్చిందో సులభంగా తెలిసిపోతుంది. దీంతో పాటు విద్యార్థులు జవాబు పత్రాలు ఒకరికొకరు మార్చుకోకుండా చూడవచ్చు. ఈ క్యూఆర్ కోడ్‌లో విద్యార్థికి సంబంధించిన వివరాలుంటాయి. అలాగే ఈసారి జవాబు పత్రాలకు బదులుగా విద్యార్థులకు 24 పేజీలతో కూడిన బుక్‌లెట్‌ను అందించనున్నారు. విద్యార్థులు ప్రతిసారి అదనపు జవాబు పత్రాలను అడగాల్సిన అవసరం ఉండకుండా ఈ చర్యలు తీసుకున్నారు. భౌతిక, రసాయన శాస్త్రం, జీవ శాస్త్రాలకు మాత్రం 12 పేజీల చొప్పున జవాబు పత్రాల బుక్‌లెట్ ఇస్తారు. అలాగే ఈసారి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికారు. పాత పద్ధతిలో 100 మార్కుల విధానాన్ని అమలు చేయనున్నారు.
రేపటి నుంచి పరీక్షల నిర్వహణ
జిల్లాలో 64 కేంద్రాలు..
పరీక్ష రాయనున్న
12,579 మంది విద్యార్థులు
అన్ని ఏర్పాట్లు చేశాం
పదో తరగతి పరీక్ష నిర్వహణకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రాలలో అవసరమైన సౌకర్యాలు కల్పించాం. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి.
– ఎస్.రాజు, డీఈవో, కామారెడ్డి
‘పది’ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు