
వెంచిర్యాల్‌లో సాగవుతున్న మక్క పంట
బాల్కొండ: మొక్కజొన్న పంటను లద్దె పురుగు జాతికి చెందిన కత్తెర పురుగు కాటేస్తుంది. దీంతో పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలో సోయా పంటకు ప్రత్యమ్నాయంగా మక్కపంటను అధికంగా చేశారు. ప్రస్తుత సంవత్సరం ఎడ తెరిపి లేకుండా వర్షం కురవడంతో ఇది వరకే పంటకు వేరుకుళ్లు తెగులు సోకి ఎండిపోతున్నాయి. రైతులు అనేక రసాయన మందులు పిచికారి చేసి పంటకు ఒక రూపం తీసుకువచ్చారు. ప్రస్తుతం మళ్లీ కత్తెర పురుగు వెంటాడుతుంది. ప్రధానంగా మొక్క జొన్న పంటలో అధికంగా వ్యాపిస్తుందని రైతులు అంటున్నారు. మక్క పంటలో కాండం లోపలికి ప్రవేశించి కాండంలో గుజ్జుతో పాటు, ఆకులను కూడా వదలకుండా పురుగు తినేయడంతో మక్క పంట ఎదుగుదల లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల నుంచే మొక్క జొన్న పంటకు కత్తెర పురుగు నష్టం చేస్తోంది. ప్రస్తుత సంవత్సరం పంట మొలకెత్తిన నుంచే కత్తెర పురుగు వదలడం లేదు. దీంతో ఖరీఫ్‌లో మక్క పంటను సాగు చేయాలంటే రైతులు జంకుతున్నారు.
దిగుబడిపై తీవ్ర ప్రభావం
కత్తెర పురుగుతో పంటకు తీవ్ర నష్టం కలుగుతుంది. అంతే కాకుండ పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పుడు వ్యాపించిన కత్తెర పురుగు మక్క కంకులు వేసే వరకు వ్యాపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఖరీప్, రబీ సీజన్‌లో మక్క కంకుల్లోకి కూడా పురుగు ప్రవేశించి పంటను పూర్తిగా నాశానం చేసింది. దీంతో ఎకరానికి 10 క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉంటే తీవ్రంగా నష్ట పోతామంటున్నారు.
మందులు వేసినా తగ్గడం లేదు
మక్కలో కత్తెర పురుగు ఎక్కువగా ఉంది. పురుగులు కర్రలను పూర్తిగా తినేస్తున్నాయి. ఇప్పటి వరకు మూడు సార్లు మందులు పిచికారి చేసినా తగ్గడం లేదు. మూడేళ్ల నుంచి ఈ రకం పురుగు ఎక్కువగా తింటుంది. ఎక్కువగా నష్టం జరిగే ప్రమాదం ఉంది.
– గంగాధర్ యాదవ్, రైతు, వెంచిర్యాల్
నివారణ చర్యలు
కత్తెర పురుగు నివారణకు చేపట్టాల్సిన చర్యలను బాల్కొండ వ్యవసాయ అధికారి మహేందర్‌రెడ్డి సూచించారు. చుంచు దశలో ఉన్న పంటకి 3 జీ గుళికలు ఎకరానికి 3 కిలోలు వేసుకోవాలి. పురుగు ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు క్లోరీఫైరిఫాస్ 400 ఎంఎల్, క్వీనోలోపాస్ 400 ఎంఎల్ 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేయాలి. పురుగు ఉధృతి మధ్యస్థలో ఉన్నప్పుడు ఇమామెక్టిమ్ బెంజయోట్80 గ్రాములు, సైపనో ఫాస్ 60 ఎంఎల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే క్లోరాంత్రనిలోపోల్ 60 ఎంఎల్, ఇండాక్స్ కార్బో200 ఎంఎల్, లాంబ్డసైలోతిన్ 200 ఎంఎల్ ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

కత్తెర పురుగు తినేసిన మక్క కర్ర
