
హమాలీలతో గొడవ.. వడ్లకు నిప్పుపెట్టిన రైతులు
భిక్కనూరు: వరిధాన్యం కాంటా విషయంలో హమాలీలతో గొడవపడ్డ ఇద్దరు రైతులు తమ వడ్ల కుప్పకు నిప్పుపెట్టేందుకు యత్నించారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఇద్దరు రైతులు వడ్లను భిక్కనూరు పాత జాతీయ రహదారిపై ఆరబోశారు. వాటిని తూకం వేయాలని సింగిల్‌విండో సిబ్బందిని కోరారు. సీరియల్‌గా తూకం వేస్తామని సిబ్బంది చెప్పడంతో సరేనని అక్కడే ఉన్నారు. మధ్యాహ్న సమయంలో హమాలీలు భోజనం చేసేందుకు వెళ్లారు. చాలాసేపటి వరకు రాకపోవడంతో వారికోసం వెతకగా.. మార్కెట్ యార్డులో మక్కలను కాంటా చేస్తూ కనిపించారు. దీంతో రైతులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీలు అడిగిన డబ్బులు ఇవ్వనందున ఇలా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హమాలీల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో తమ ధాన్యం కుప్పల వద్దకు వచ్చి నిప్పపెట్టేందుకు యత్నించారు. అక్కడే ఉన్న మిగతా రైతులు వారిని వారించారు.
విషయం తెలుసుకున్న సింగిల్‌విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి కాంటాలు వేయించారు. అనంతరం డీసీవో రామ్మోహన్ తహసీల్దార్ శివప్రసాద్‌తో కలిసి భిక్కనూరుకు వచ్చి సదరు రైతులను కలిసి వివరాలు సేకరించారు.
అడ్డుకున్న తోటి రైతులు
తూకం వేయించిన అధికారులు