ఇళ్ల స్థలాలిచ్చే ఆలోచనుందా? లేదా?
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీ నెరవేర్చడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు విమర్శించారు. కాకినాడ నగరంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను, జగనన్న కాలనీలను సీపీఐ జిల్లా సమితి బృందం శుక్రవారం పరిశీలించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం చాలా మందికి ఇళ్ల స్థలాలిచ్చిందని, డబ్బు లేక అప్పట్లో ఇళ్లు నిర్మించుకోలేని వారందరికీ ప్రభుత్వం వెంటనే రూ.6 లక్షల సబ్సిడీ ఇచ్చి, ఇళ్లు నిర్మించాలని మధు డిమాండ్ చేశారు. అర్హులందరికీ ఇళ్ల స్థలాలివ్వాలని సంవత్సరం కాలంగా సీపీఐ దరఖాస్తులు పూర్తి చేసి, ప్రభుత్వానికి ఇచ్చిందని, దీనిపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్యా తీసుకోలేదని అన్నారు. సూపర్ సిక్స్‌లో ప్రధానమైన ఇళ్ల స్థలాల హామీని చంద్రబాబు సర్కార్ తుంగలో తొక్కిందని విమర్శించారు. అసలు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలిచ్చే ఆలోచన ఉందా, లేదా అని ప్రశ్నించారు. నగరంలో 2,050 టిడ్కో ఇళ్లు ఇప్పటికీ లబ్ధిదారులకు అందించకుండా వారి భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికై నా వెంటనే నిధులు మంజూరు చేసి, టిడ్కో ఇళ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించి, లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. పేదల బస్తీలుగా ఉండాల్సిన టిడ్కో ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోతున్నాయని మధు దుయ్యబట్టారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, కార్యవర్గ సభ్యులు పప్పు ఆదినారాయణ, పి.సత్యనారాయణ ఎ.భవాని, బొబ్బిలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.


