ముళ్లకు నెలలు బ్రేక్
3
అన్నవరం: మూడు ముళ్లబంధంతో కొత్త జంటలు ఒక్కటవ్వడానికి మూడు నెలలు బ్రేక్ పడనుంది. ప్రాగస్తమిత శుక్ర మూఢమి ఆదివారం ప్రారంభం కానుంది. ఇది వచ్చే ఫిబ్రవరి 13న మాఘ బహుళ ఏకాదశి నాడు ముగుస్తుంది. దీంతో, సుమారు మూడు నెలల పాటు వివాహాది శుభకార్యాలకు విరామం ఏర్పడనుంది. తిరిగి ఫిబ్రవరి 19 నుంచి వివాహాలు జరగనున్నాయి. కొద్ది నెలలుగా వివాహాది శుభకార్యాలతో అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం సందడిగా మారింది. గత ఆశ్వయుజం, కార్తిక మాసాల్లో రత్నగిరిపై పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ప్రస్తుత మార్గశిర మాసంలో కూడా గత తొమ్మిది రోజులూ పెళ్లిళ్లు జోరుగానే జరిగాయి. ఈ వివాహాల కారణంగా కార్తిక మాసం అనంతరం కూడా రత్నగిరిపై తీవ్ర రద్దీ నెలకొంది. అటువంటిది నేటి నుంచి మూఢమి ప్రారంభ కానుండటంతో ‘మాంగల్యంతంతునానేనా..’కు విరామం కలగనుంది.
మాఘంలో కూడా వివాహాలు లేనట్టే..
ఈసారి వచ్చే జనవరి 19న ప్రారంభమయ్యే మాఘ మాసంలో కూడా పెద్దగా వివాహాలు లేవు. ఆ నెలలో సుమారు 20 రోజుల పాటు శుక్ర మూఢమి కొనసాగడమే దీనికి ప్రధాన కారణం. దీనికి తోడు ఆ తరువాత కూడా వివాహ ముహూర్తాలు లేవు. తిరిఇ ఫాల్గుణ మాసంలోనే పెళ్లి ముహూర్తాలున్నాయి. ఫిబ్రవరి 18న ఫాల్గుణ మాసం ప్రారంభమవుతోంది. అదే నెల 19వ తేదీ నుంచి వివాహ ముహూర్తాలున్నాయి. అప్పటి నుంచి మార్చి 17వ తేదీ వరకూ వివాహాలు జరగనున్నాయి. మార్చి 19న పరాభవ నామ నూతన తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి వివాహాలు మళ్లీ మొదలవుతాయని పండితులు చెబుతున్నారు. ఏటా మార్గశిరం, మాఘ మాసాల్లో రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిన పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఈ ఏడాది శుక్ర మూఢమి కారణంగా ఫిబ్రవరి 13 వరకూ వివాహాలు లేకపోవడంతో వివాహ మండపాలు, పురోహితులు, క్యాటరింగ్, సన్నాయి మేళం, ఫ్లవర్ డెకరేషన్ తదితర రంగాల వారి ఉపాధికి కొంత ఇబ్బందే కలగనుంది.
నేటి నుంచి ఫిబ్రవరి
13 వరకూ శుక్ర మూఢమి
వివాహాది శుభకార్యాలకు ఆటంకం
మళ్లీ ఫిబ్రవరి 19 నుంచే
‘మాంగల్యంతంతునానేనా..’
ముళ్లకు నెలలు బ్రేక్


