నూతన విద్యా విధానం.. పేదలకు చదువులు దూరం
● ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్
● పిఠాపురంలో ఆ సంఘం జిల్లా మహాసభలు
పిఠాపురం: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం పేద, మధ్య తరగతి విద్యార్థులకు చదువును దూరం చేస్తుందని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్ అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా 30వ మహాసభలు పిఠాపురంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వరకూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రామ్మోహన్ ప్రసంగించారు. విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వం మతోన్మాద ధోరణిని చొప్పించేందుకే నూతన జాతీయ విద్యా విధానం, ఎల్‌ఓసీఎఫ్ విధానాలు అమలు చేస్తోందని అన్నారు. తద్వారా విద్యార్థులో శాసీ్త్రయ దృక్పథానికి బదులు అశాసీ్త్రయ భావాలు చొప్పిస్తోందని విమర్శించారు. ఈ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తన భుజాన వేసుకుని అమలు చేస్తోందని అన్నారు. కేంద్రం విధానాలతో ప్రభుత్వ విద్యా సంస్థలను మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో 3, 4, 5 తరగతుల విలీనం, మోడల్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలను విచ్ఛిన్నం చేస్తోందని అన్నారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు విద్యార్థి సంఘాలను అనుమతించబోమంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. విద్యార్థుల రాజ్యాంగపరమైన హక్కుకు ఈ ఉత్తర్వులు విఘాతంగా మారాయన్నారు. అందరికీ ఉచిత విద్య అందిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. నేడు అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్నా ఆ హామీ అమలు చేయడం లేదని విమర్శించారు. పీజీ విద్యార్థులకు గుదిబండగా ఉన్న జీఓ నంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ అవతరణ దినోత్సవం నాడు విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించి, విద్యార్థులందరూ రాజకీయ నాయకులుగా తయారు కావాలని చెప్పిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. వీటిని వెంటనే నిర్వహించాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు.
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ, జిల్లాలోని విద్యారంగ సమస్యలను పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ తానే పరిష్కరిస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. పిఠాపురంలోని ఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ జూనియర్ కళాశాల భవనాలు పాతబడి, ఎప్పుడు మీద కూలుతాయోనని విద్యార్థులు బిక్కుబిక్కుమంటున్నారని, ఇక్కడ నూతన భవనాలు కట్టించకపోవడం దుర్మార్గమని అన్నారు. పిఠాపురం నియోజవర్గంలోని గొల్లప్రోలు జూనియర్ కళాశాలకు స్థలం కేటాయించి, నూతన భవనం నిర్మించాలని, కొత్తపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షురాలు జి.చిన్ని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల కార్యదర్శి కె.సిద్ధు, జిల్లా నాయకులు సాయిత్, అమృత, నాని, సంతోష్, జైరామ్, వడ్డి కాసులు తదితరులు పాల్గొన్నారు.
నూతన విద్యా విధానం.. పేదలకు చదువులు దూరం


