భారీగా వదిలిన ‘నేతి’చమురు
● టెండర్ ద్వారా కొనాలని
గత ఆగస్టులో కమిషనర్ ఆదేశం
● ఇప్పటికే కొటేషన్ ద్వారానే
కొనుగోళ్లపై ఆగ్రహం
● అన్నవరం దేవస్థానంపై సుమారు రూ.50 లక్షల భారం
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ప్రసాదం తయారీకి ఉపయోగించే ఆవు నేతిని టెండర్ ద్వారా కాకుండా కొటేషన్ పద్ధతిపై కొనుగోలు చేయడంపై దేవదాయ, ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి హరి జవహర్‌లాల్, కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఈఓ వీర్ల సుబ్బారావును ప్రశ్నించినట్లు సమాచారం. దీనిపై ఆయన సరైన సమాధానం చెప్పకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యదేవుని ప్రసాదం తయారీకి అవసరమైన ఆవు నేతిని గత ప్రభుత్వ హయాంలో టెండర్ ద్వారా పిలిచి ఖరారు చేసేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ టెండర్లు రద్దు చేసి, సహకార డెయిరీల నుంచి కొటేషన్లు పిలిచి కొనాలని ఆదేశించింది. ఆ ప్రకా రం సంగం, విజయ డెయిరీల నుంచి కిలో సుమా రు రూ.590కి కొంటున్నారు. అయితే, గత ఆగస్టు లో టెండర్ పిలిచి, ఆవు నెయ్యి కొనుగోలు చేయా లని కమిషనర్ ఆదేశించారు. అయినప్పటికీ, దేవస్థానంలో పాత పద్ధతిలోనే కొటేషన్ల ద్వారా ఇప్ప టి వరకూ సుమారు రూ.3 కోట్లు ఖర్చు చేసి, 60 వేల కిలోల నెయ్యి కొనుగోలు చేశారు. అదే టెండర్ ద్వారా అయితే కేజీ నెయ్యి రూ.50 నుంచి రూ.100 తక్కువకు వచ్చేదనే అభిప్రాయం వ్యక్త మవుతోంది. తద్వారా దేవస్థానంపై రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ భారం తగ్గేద ని ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై సవివరంగా నివేదిక ఇవ్వాలని ఈఓను ఉన్నతాధికారులు ఆదేశించారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం రద్దీగా మారింది. సుమారు 40 వేల మంది సత్యదేవుని దర్శించుకున్నారు. మూడు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. సత్యదేవుని అన్నప్రసాదాన్ని 6 వేల మంది స్వీకరించారు. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని ఉదయం తిరుచ్చి వాహనంపై ఘనంగా ఊరేగించారు. దశమి తిథి కావడంతో ఆదివారం కూడా రత్నగిరిపై తీవ్ర రద్దీ ఉండే అవకాశం ఉంది.
ఆన్‌లైన్‌లో సత్యదేవుని సేవా టికెట్లు
అన్నవరం: సత్యదేవుని ఆలయానికి వచ్చే భక్తులు వ్రతాలు, స్వామివారి దర్శనం, ప్రసాదం కొనుగోలు, వసతి గదుల కేటాయింపు తదితర సేవల కు ఆన్‌లైన్ ద్వారా కూడా టికెట్లు పొందవచ్చునని దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్వామివారి అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళాలు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చునని తెలిపారు. ఆన్‌లైన్ టికెట్ల కోసం APTEMPLES.ORG వెబ్‌సైట్ ద్వారా అన్నవరం దేవస్థానాన్ని సంప్రదించాలన్నారు. అలాగే, ‘మన మిత్ర’ వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా కూడా నిర్దేశిత మొత్తం చెల్లించి పై సేవలు పొందవచ్చని తెలిపారు. అన్నదానం, గోసంరక్షణ ట్రస్టులకు ఫోన్ పే, గూగుల్ పే, భీమ్ తదితర యూపీఐ యాప్‌లు, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా చెల్లించవచ్చని వివరించారు.


