సమగ్ర శాసీ్త్రయ కులగణన చేపట్టాలి
యానాం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర శాసీ్త్రయ కులగణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. యానాం గీతా మందిరంలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ ప్రతినిధుల సమావేశం మల్లాడి కృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశారథన్ మహారాజు, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ, మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సమగ్ర శాసీ్త్రయ కులగణన నిర్వహించి తమిళనాడు రాష్ట్రంలో అమలు చేస్తున్న 69 శాతం రిజర్వేషన్లు మాదిరిగా ఏపీలోనూ స్థానిక సంస్థల్లో అమలు చేయాలన్నారు. ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా 9వ షెడ్యూల్‌లో చేర్చాలని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలులోని లోపాలను సరిదిద్ది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. జాతీయస్థాయిలో ఉద్యమ నిర్మాణం చేపడతామని, త్వరలో ఏపీ, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను కలిసి కేంద్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఈ డిమాండ్లు నెరవేరేవరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ పప్పు దుర్గారమేష్, పెస్పింగి ఆదినారాయణ, గూడూరి వెంకటేశ్వరరావు, బీసీ రమణ, కర్రి చిట్టిబాబు, ఘంటసాల వెంకటలక్ష్మి, కడలి ఈశ్వరి, చొల్లంగి వేణుగోపాల్, మన్నే నాగేశ్వరరావు పాల్గొన్నారు.


