తెలుగు సినీ హాస్య దిగ్గజం రేలంగి
కొత్తపేట: సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు సినీ రంగంలో హాస్య దిగ్గజంగా మన్ననలు అందుకున్నారు రేలంగి వెంకట్రామయ్య. వందేళ్ల తెలుగు సినీ రంగ చరిత్రలో హాస్య నటునిగా, హాస్య పితామహునిగా సుస్థిర స్థానం సొంతం చేసుకున్నారు. సినీ పరిశ్రమకు ఎందరు హాస్యనటులు వచ్చినా రేలంగికి సాటి లేరన్నట్టుగా గుర్తింపు పొందారు. పద్మశ్రీ అవార్డు పొందిన తొలి హాస్య నటునిగా చరిత్రలో నిలిచారు.
రేలంగిగా పేరుగాంచిన రేలంగి వెంకట్రామయ్య 1910 ఆగస్ట్ 9న తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా) రావులపాలెం మండలం రావులపాడు గ్రామంలో రామదాసు (రామస్వామి), అచ్చయ్యమ్మ దంపతులకు జన్మించారు. తండ్రి హరికథ, సంగీతం నేర్పించేవారు. చిన్నతనంలో తండ్రి వద్దే రేలంగి ఈ విద్యలు నేర్చుకున్నారు. బాల్యమంతా ఎక్కువ భాగం రావులపాడు, కాకినాడల్లో గడిచింది. కాకినాడ మెక్లారిన్ పాఠశాలలో చదువుకున్నారు. రేలంగి రూపం చూసి తండ్రి పోలీసును చేయాలని ఆశపడ్డారు. కానీ రేలంగి దృష్టి నాటక రంగం వైపు మళ్లింది. చదువుకునేటప్పుడే నాటకాల్లో నటించారు. దాంతో చదువు సజావుగా సాగలేదు. రామదాసు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో, కుమారుడిని ఎంఎస్‌ఎస్ చార్టీస్ సాయంతో చదివించాలనుకున్నారు. నాటకాలపైనే ఎక్కువ ఆసక్తి ఉండడంతో రేలంగి చదువు తొమ్మిదో తరగతిలో ఆగిపోయింది.
నాటక రంగ ప్రవేశం
ఓసారి రామదాసు తన కుమారుడిని యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్ వేస్తున్న రఘుదేవ రాజీయం అనే నాటకానికి తీసుకెళ్లారు. అది రేలంగికి బాగా నచ్చి, తానూ నాటకాల్లో నటించాలనే కోరిక పుట్టింది. తండ్రికి తెలియకుండా నాటకాల్లో నటించడం మొదలెట్టారు. యంగ్‌మెన్ హ్యాపీ క్లబ్‌లో చేరి 1919లో తన పదో ఏట బృహన్నల అనే నాటకంలో తొలిసారి సీ్త్ర పాత్రలో నటించారు. తర్వాత కాలంలో ఇదే క్లబ్‌లో ఎస్వీ రంగారావు, అంజలీదేవి తదితరులూ నాటకాలు వేశారు. అప్పట్లో ఆడ వేషాలకు నటులు అంతగా ముందుకు రాకపోవడంతో రేలంగికి విరివిగా అవకాశాలు వచ్చాయి.
బుచ్చియమ్మతో వివాహం
పెళ్లి చేస్తే జీవితం గాడిలో పడుతుందని భావించి తండ్రి రామదాసు తాడేపల్లిగూడెం పక్కనున్న పెంటపాడుకు చెందిన బుచ్చియ్యమ్మతో రేలంగికి పెళ్లి చేశారు. అప్పటికీ రేలంగి జీవితంలో స్థిరపడకపోయినా, కళాకారుడిగా గౌరవించారు ఆయన బావమరుదులు. భార్య తరఫున ఎంత సంపద ఉన్నా, సొంత కాళ్లపై నిలబడాలని రేలంగి మళ్లీ నటించడం మొదలెట్టారు. వచ్చిన సంపాదనను భార్య చేతిలో పెట్టేవారు. వారికి జన్మించిన కుమారుడితో ఆ దంపతుల జీవితం అన్యోన్యంగా సాగింది.
ప్రత్యేక అనుబంధం
పౌరాణిక రంగస్థల, సాంఘిక నాటక కళాకారుడు, తెలుగు సినీ హాస్య నటుడు రేలంగికి కళలకు పుట్టినిల్లయిన రాజమహేంద్రవరంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడ లలిత కళా నికేతన్ వారు హాస్య బ్రహ్మగా పేరొందిన భమిడిపాటి కామేశ్వరరావు చేతుల మీదుగా హాస్య నటచక్రవర్తి బిరుదును అందుకున్నారు. ఇదే సభలో రేలంగిని గోదావరి జిల్లాల అభిమానులు సువర్ణ కంకణంతో ఘనంగా సత్కరించారు.
అపర దానకర్ణుడు
రేలంగి వెంకట్రామయ్యను అప్పట్లో అపర దానకర్ణుడిగా చెప్పుకొనేవారు. మద్రాసులో రేలంగి ఇంటి వద్ద నిత్య అన్నదానం జరిగేది. సాయం ఆర్థించి వెళ్లిన వారికి లేదనకుండా దానధర్మాలు చేసిన గొప్ప వ్యక్తి రేలంగి అని చెబుతారు. గోదావరి ప్రాంతంపై ఉన్న మమకారంతో తాడేపల్లిగూడెంలో రేలంగి చిత్ర మందిర్ పేరిట ధియేటర్‌ను నిర్మించారు. చివరి అంకంలో ఆయన అక్కడే స్థిరపడ్డారు. 1975 నవంబర్ 27న తాడేపల్లిగూడెంలోని తన స్వగృహంలో వయోభారం, అనారోగ్యంతో బాధ పడుతూ తుది శ్వాస విడిచారు.
గోదావరి తీరాన కాంస్య విగ్రహం
ఉభయ గోదావరి జిల్లాలకు చిరపరిచితుడైన రేలంగి వెంకట్రామయ్య కాంస్య విగ్రహం రాజమహేంద్రవరంలో నెలకొల్పారు. ఆయన అభిమానులు, రాజమహేంద్రవరం గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేలంగి ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని కొత్తపేటలో ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ రూపొందించారు. రాజమహేంద్రవరం గోదావరి గట్టున దివంగత సినీ ప్రముఖుల విగ్రహాల సరసన గతేడాది సెప్టెంబర్ 19న విగ్రహావిష్కరణ జరిగింది.
1935లో ప్రవేశం
నాటక రంగంలో అనుభవమున్న రేలంగికి 1931లో విడుదలైన భక్త ప్రహ్లాద చిత్రం ఆకట్టుకుంది. తానూ చలనచిత్రాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. శ్రీకృష్ణ తులాభారం సినిమా నిర్మాణానికి నిర్మాత ఐ.రాజారావు సన్నాహాలు పూర్తి చేశారు. తబలా కళాకారుడు పరదేశి.. రేలంగిని దర్శకుడు సి.పుల్లయ్యకు పరిచయం చేశారు. అలా శ్రీకృష్ణ తులాభారం చిత్రం ద్వారా 1935లో రేలంగిని దర్శకుడు పుల్లయ్య సినీ రంగానికి పరిచయం చేశారు. అందులో కొద్దిసేపు కనిపించే వసుదేవుడు, చాకలివాడు, గొల్లవాడు లాంటి పాత్రల్లో రేలంగి నటించారు. ఈ సినిమాలో నటనకు రేలంగికి నాలుగు నెలల బస, భోజనం పెట్టి, రూ.డైబ్భె పారితోషికం ఇచ్చారు. ఆ సమయంలో పుల్లయ్య వద్ద నటనతో పాటు, పలు సినీ విభాగాల్లో పని చేశారు. 1948లో వచ్చిన వింధ్యరాణి సినిమాతో రేలంగి కెరీర్ విజయాల బాట పట్టింది. తర్వాత కీలుగుర్రం, నర్తనశాల, హరిశ్చంద్ర, గుణసుందరి కథ, పాతాళ భైరవి, పెద్ద మనుషులు, మాయాబజార్, జగదేకవీరుడు, మిస్సమ్మ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు 300కు పైగా చిత్రాల్లో నటించారు. అప్పట్లో హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న హాస్య నటుడిగా రేలంగి గుర్తింపు పొందారు. నటుడిగా తారాస్థాయి అందుకున్న రేలంగి అనేక సన్మానాలు, బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. 1954లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్మశ్రీ అవార్డును కళా రంగం నుంచి హాస్య నటునిగా అందుకున్న ఘనత రేలంగికే దక్కింది. 1970లో ప్రదానం చేసిన ఈ అవార్డు తెలుగు వారికి గర్వకారణంగా నిలిచింది. ఆ సందర్భంగా మద్రాస్ పురవీధుల్లో తెలుగు, తమిళ మహా నటుల నడుమ రేలంగిని అంబారీపై ఊరేగించి, విజయా గార్డెన్స్‌లో ఘనంగా సన్మానించారు.
పద్మశ్రీ అవార్డు పొందిన
తొలి భారతీయ హాస్య నటుడు
గోదావరి ప్రాంతంతో ఎనలేని అనుబంధం
రాజమహేంద్రవరంలో
ఆయన కాంస్య విగ్రహం
నేడు 50వ వర్ధంతి
తెలుగు సినీ హాస్య దిగ్గజం రేలంగి
తెలుగు సినీ హాస్య దిగ్గజం రేలంగి
తెలుగు సినీ హాస్య దిగ్గజం రేలంగి


