కాలువకు పొంచి ఉన్న ముప్పు
● తవ్వేస్తున్న పోలవరం కుడి కాలువ గట్టు
● పరిహారం పొందినా..
20 ఎకరాల్లో చేస్తున్న సాగు
● చదును చేసి కౌలుకు ఇస్తున్న వైనం
గోపాలపురం: బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పోలవరం కుడి ప్రధాన కాలువకు ముప్పు పొంచి ఉంది. మండలంలోని చెరుకుమిల్లి, చిట్యాల గ్రామాల మధ్య ఉన్న సుమారు 20 ఎకరాల కాలువ గట్టు మట్టిని కొల్లగొట్టి, ఆ భూమిని సాగులోకి తెచ్చేలా అక్రమార్కులు యత్నిస్తున్నారు. కాలువ తవ్వకాల సమయంలో ఆయా గ్రామాల రైతులకు భూముల నష్ట పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించింది. భవిష్యత్తు అవసరాల మేరకు కాలువల విస్తరణ కోసం భూసేకరణ చేసింది. ఆ భూములపై కన్నేసిన కొందరు అక్రమార్కులు కాలువ గట్టు మట్టిని అమ్ముకోవడమే కాకుండా, ఆ భూమిలో సాగు చేపట్టారు. చెరుకుమిల్లి గ్రామంలో ఏకంగా కాలువ గట్టు సైతం తవ్వేశారు. దీంతో ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందోనని సమీప భూముల రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ గట్టుపై నుంచి వర్షపు నీరు పోలవరం కుడి ప్రధాన కాలువకు వచ్చేలా ఏకంగా కాలువకు గండి కొట్టేశారు. అధిక వర్షం కురిస్తే కాలువలోకి వచ్చే వరద నీటితో పాటు, కాలువ కాంక్రీట్ కూడా దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. చెరుకుమిల్లి, చిట్యాల కాంటూరు నంబరు 17, 18 వద్ద ఉన్న కాలువ గట్ల పటిష్టత పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నారు.
మట్టి తరలింపు
అలాగే భీమోలు, గోపాలపురం, పెద్దాపురం, గుడ్డిగూడెం గ్రామాల మీదుగా వెళుతున్న పోలవరం కుడి ప్రధాన కాలువ గట్టు మట్టిని రాత్రి సమయాల్లో పొక్లెయిన్లతో తవ్వి, ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. చెరుకుమిల్లిలో గట్టు మట్టిని తరలించి, పొగాకు సాగు కోసం ఎకరం రూ.50 వేల నుంచి రూ.70 వేలకు కౌలుకు ఇచ్చి కొందరు సొమ్ము చేసుకున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా అటువైపు కాలువకు సంబంధించిన అధికారులు కానీ, రెవెన్యూ, పోలీసు అధికారులు కానీ కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, కాలువ మరమ్మతులు చేపట్టి, గట్టు పటిష్టతకు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
కాలువకు పొంచి ఉన్న ముప్పు


