గోవుల మరణాలపై సమగ్ర విచారణ
రాజమహేంద్రవరం రూరల్: రాజమండ్రి సమీపంలోని బొబ్బిల్లంకలో ఉన్న భగవాన్ మహావీర్ జైన్ గోశాలలో గోవులు చనిపోతున్నాయన్న అంశంపై సమగ్ర విచారణకు ఆర్‌టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం ఆదేశించారు. కమిషనర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. బొబ్బిల్లంకలోని భగవాన్ మహావీర్ జైన్ గోశాలలో చనిపోయిన గోవులు ఎన్ని, ఏ కారణాల వల్ల చనిపోయాయి, గోశాల సామర్థ్యం ఎంత, సిబ్బంది, ఆహారం, నీటి నిల్వలు తదితర అంశాలపై సామాజిక కార్యకర్త ఆర్ శ్రీనివాస్ ఆర్టీఐ కింద 2023 అక్టోబర్ 30న సమాచారాన్ని అడిగారు.
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సరైన సమాధానం రాకపోవటంతో, గతేడాది జూన్‌లో ఏపీ ఇన్ఫర్మేషన్ కమిషన్‌లో సెకెండ్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసును ఈ ఏడాది ఆగస్ట్ 12న విచారణ చేసిన ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం దరఖాస్తుదారుకు పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు.
కమిషనర్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం గోశాలలో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపింది. గోశాల నిర్వహణలో లోపాలను గుర్తించింది. సీసీ కెమెరాలు పని చేయటం లేదని, రికార్డులను సరిగా నిర్వహించటం లేదని నివేదికలో పేర్కొంది. గోశాల నిర్వహణను ఎండోమెంట్ శాఖకు అప్పగించేలా ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌కు మున్సిపల్ కమిషనర్ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గోవులను రెగ్యులర్‌గా పర్యవేక్షించేందుకు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్‌ను నియమిస్తూ జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. కాగా, మంగళగిరి కమిషన్ కార్యాలయంలో మంగళవారం జరిగిన విచారణకు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ డాక్టర్ వినూత్న ప్రత్యక్షంగా హాజరై, విచారణ నివేదిక కమిషనర్‌కు, దరఖాస్తుదారుకు సమర్పించారు.
భగవాన్ మహావీర్ జైన్ గోశాల ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉందని, ప్రభుత్వ యంత్రాంగం అఽధీనంలో లేదని ఆర్టీఐ కమిషనర్ డాక్టర్ రెహానాబేగం దృష్టికి తీసుకొచ్చారు. గోశాల ప్రైవేటు సంస్థ నిర్వహణ కింద ఉన్నప్పటికీ, గోవుల సంరక్షణ విషయంలో ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత నుంచి తప్పించుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు. గోశాలలో గోవుల మరణాల ఆరోపణలు, వాస్తవ పరిస్థితిపై క్షేత్ర స్థాయి పరిశీలన చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఆదేశించిన ఆర్టీఐ కమిషనర్


