పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం
తుని: పట్టణంలోని బెల్లపువీధిలో ఉన్న ఆర్యవైశ్య కల్యాణ మండపంలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పెళ్లి బృందానికి త్రుటిలో ముప్పు తప్పింది. పాయకరావుపేటకు చెందిన ఓ పెళ్లి బృందం బాజా భజంత్రీలతో పెళ్లి వేడుక నిర్వహిస్తోంది. వీరంతా కల్యాణ మండపంలో భోజనాలు చేస్తుండగా, వసతి గదులున్న ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ గదిలో ఉన్న ఏసీ నుంచి మంటలు చెలరేగి, కల్యాణ మండపం పొగతో కమ్మేసింది. దీంతో పెళ్లి బృందం వారికి ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. రెండు ఫ్లోర్లలోనూ పొగ కమ్మేయడంతో పెళ్లి బృందం అరుపులు కేకలతో పరుగులు తీశారు. గదిలో ఓ వృద్ధురాలు మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో పెళ్లి బృందం వారు మరింత ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, స్థానికుల సహకారంతో లోపలికి వెళ్లి వృద్ధురాలిని కాపాడారు. మంటలను అదుపు చేయడంతో అంతా ఊరిపి పీల్చుకున్నారు.


