వీర్లా.. కొత్తవార్లా!
అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా త్వరలో దేవదాయ శాఖకు చెందిన అధికారిని నియమించనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం ఇక్కడ ఈఓగా ఉన్న వీర్ల సుబ్బారావు డెప్యూటేషన్ వచ్చే నెల 13వ తేదీతో పూర్తవుతూండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. వాస్తవానికి ఆయనను అన్నవరం దేవస్థానం ఈఓగా డెప్యూటేషన్‌పై నియమిస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 29న జీఓ విడుదల చేసింది. ఈ మేరకు దేవదాయ, ధర్మాదాయ శాఖ అదే నెల 12న ఉత్తర్వులు ఇవ్వగా, సుబ్బారావు గత ఏడాది డిసెంబర్ 14న అన్నవరం దేవస్థానం ఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో వచ్చేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, సుబ్బారావునే మరో ఏడాది పాటు ఇక్కడ ఈఓగా కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.
వివాదాలు.. వివాదాస్పద నిర్ణయాలు
ఫ వాస్తవానికి గడచిన ఏడాది కాలంగా అన్నవరం దేవస్థానంలో అనేక వివాదాలు నెలకొన్నాయి.
ఫ గత ఏప్రిల్‌లో నీటి ఎద్దడి కారణంగా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో దేవస్థానం సత్రాల్లో ఏసీ గదులు అద్దెకు ఇవ్వొద్దంటూ ఈఓ సుబ్బారావు ఆదేశించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్క రోజులోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
ఫ దేవస్థానంలో ఈఓ కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువవడంతో ‘చినబాబొచ్చారు.. బహుపరాక్’ శీర్షికన ఏప్రిల్‌లో ‘సాక్షి’ ప్రచురించిన కథనం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఫ అలాగే, ఈఓ వేధిస్తున్నారంటూ సిబ్బంది సెలవుకు దరఖాస్తు చేయడం, కొంతమంది వీఆర్‌ఎస్‌పై వెళ్లడం వంటి వాటిపై ‘స్వామీ.. నీ కొలువుకు సెలవు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. వీటితో పాటు మీడియాలో పలు వివాదాలపై కథనాలు ప్రచురితమవడంతో వీటిపై విచారణకు కమిషనర్ ఆదేశించారు. ఆ మేరకు అడిషనల్ కమిషనర్ చంద్రకుమార్ ఏప్రిల్ 23న దేవస్థానంలో అధికారులతో సమావేశమై, వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. విచారణకు హాజరైన వారందరూ ఈఓ తమను వేధిస్తున్నారని చెప్పారు. ఆ మేరకు చంద్రకుమార్ కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా అప్పట్లోనే ఈఓ సుబ్బారావును బదిలీ చేస్తారని భావించారు. కానీ, ఆవిధంగా జరగలేదు. అయితే, మూడు నెలల క్రితం కమిషనర్ ఒక మెమో జారీ చేస్తూ, దేవస్థానం సిబ్బందితో సఖ్యతగా ఉండాలని, చిన్న చిన్న విషయాలకు కూడా వారితో గొడవ పడొద్దని ఈఓకు సూచించారు. ఒక ఈఓకు కమిషనర్ ఈవిధంగా మెమో ఇవ్వడం అన్నవరం దేవస్థానం చరిత్రలో అదే ప్రథమం కావడం విశేషం.
ఫ మరోవైపు దేవస్థానంలో జరిగే ప్రతి వ్యవహారం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లడం, కనీసం చిన్నపాటి ఉద్యోగి బదిలీ కూడా ప్రజాప్రతినిధి ఆదేశాలు లేకుండా చేయకపోవడం కూడా వివాదాస్పదమైంది. దీనివలన గతంలో రూ.10తో అయ్యే పనికి ఇప్పుడు రూ.100 ఖర్చు చేయాల్సి వస్తోందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఫ ఈ వివాదాల ఫలితమో ఏమో కానీ, భక్తులతో ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలలో అన్నవరం దేవస్థానం పలు విభాగాల్లో చివరి స్థానంలో నిలిచింది. ఆ తరువాత కలెక్టర్ షణ్మోహన్ దేవస్థానంలో తనిఖీ చేసి సిబ్బందిని హెచ్చరించారు. ఇప్పటికీ దాదాపు 30 శాతం భక్తులు దేవస్థానంలో వివిధ సేవలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
కార్తికం విజయవంతమైనా..
ఇదిలా ఉండగా ఇటీవల కార్తిక మాసం ఎటువంటి దుస్సంఘటనలూ లేకుండా ప్రశాంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్ ఆ నెల రోజులూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ దేవాలయం ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే ఈ నెల 5న గిరి ప్రదక్షిణ, ఇతర రద్దీ రోజుల్లో ఏర్పాట్ల పర్యవేక్షణకు దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్‌జేసీ వి.త్రినాథరావు, కాకినాడ డెప్యూటీ కమిషనర్ రమేష్‌బాబు, లోవ, వాడపల్లి దేవస్థానాల ఈఓలు విశ్వనాథరాజు, చక్రధరరావులను కమిషనర్ నియమించిన విషయం తెలిసిందే. వీరందరి కృషితోనే కార్తిక మాసం విజయవంతమైందని దేవదాయ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో అందరూ ఈఓనే అభినందిస్తారు. కానీ, ఉన్నతాధికారులు సుముఖంగా లేనందువల్లనే ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనే ప్రచారం జరుగుతోంది.
ఆర్‌జేసీ వైపు మొగ్గు
అన్నవరం దేవస్థానం ఈఓ పోస్టు కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వీరిలో గతంలో ఇక్కడ రెండుసార్లు ఈఓగా పని చేసిన ప్రస్తుత దేవదాయ శాఖ రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ కమిషనర్ (ఆర్‌జేసీ) వి.త్రినాథరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన గత ఏడాది కూడా ప్రయత్నించారు. అప్పుడు ఒక సీనియర్ నాయకుడు వచ్చేసారి అవకాశం ఇస్తానని హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇంకా రెండేళ్ల క్రితం డీసీలుగా పదోన్నతి పొందిన అధికారులు కూడా ఈఓగా రావడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త ఈఓను నియమిస్తారా లేక ప్రస్తుత ఈఓ సుబ్బారావునే మరో ఏడాది కొనసాగిస్తారా అనేది వేచి చూడాలి.
ఫ అన్నవరం దేవస్థానానికి కొత్త
ఈఓ నియామకంపై పుకార్లు
ఫ వచ్చే నెల 13తో ముగియనున్న
ప్రస్తుత ఈఓ డెప్యూటేషన్
ఫ మరో ఏడాది కొనసాగేందుకు
సుబ్బారావు ప్రయత్నాలు!
ఫ ఈ పోస్టుపై పలువురి ఆశలు


