జ్ఞాన పథం.. విజ్ఞాన రథం | - | Sakshi
Sakshi News home page

జ్ఞాన పథం.. విజ్ఞాన రథం

Nov 26 2025 6:43 AM | Updated on Nov 26 2025 6:43 AM

జ్ఞాన

జ్ఞాన పథం.. విజ్ఞాన రథం

కాకినాడ క్రైం: విజ్ఞాన రథం కదిలొచ్చింది. స్కిల్‌ ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌ విద్యార్థుల విజ్ఞాన తృష్ణను తీర్చింది. వారి బంగారు భవితకు జ్ఞానపథాన్ని పరచింది. రూ.లక్షలు వెచ్చించినా లభ్యం కాని విశేష జ్ఞానాన్ని పంచి, బెస్టాఫ్‌ లక్‌ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ స్కిల్‌ ల్యాబ్‌ బస్సుకు రూపకల్పన చేసింది. ఈ బస్సు దేశం మొత్తం సంచరిస్తోంది. ప్రభుత్వ నేతృత్వంలో ఈ సంస్థే విజ్ఞాన విస్తరణకు అవసరమైన వ్యయాన్ని భరిస్తోంది. వైద్య విద్యార్థుల్లో శస్త్రచికిత్స నైపుణ్యతను మెరుగుపరిచి, ఆధునికతను జోడించి, ఆ ప్రయోజనాలు ప్రజలకు అందేలా వైద్యుల్ని సంసిద్ధుల్ని చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. వ్యయం లేని ఈ శిక్షణను వైద్య విద్యార్థులకు ఓ వరంలా అందించడమే ఈ స్కిల్‌ ల్యాబ్‌ ఉద్దేశం.

ఇదీ బస్సు ప్రత్యేకత

సుమారు రూ.2.5 కోట్ల విలువైన ఈ బస్సులో ఐదు లాప్రోస్కోపిక్‌ సెట్లు ఉన్నాయి. వీటి ధర రూ.3 కోట్లు. పూర్తి ఎయిర్‌ కండీషన్‌తో కూడిన ఈ బస్సు లోపల ఐదు స్క్రీన్లతో పాటు ఐదు ల్యాప్‌ సెట్లు ఉంటాయి. వీటిని చైన్నెకి చెందిన ఇద్దరు సీనియర్‌ సాంకేతిక నిపుణులు నిర్వహిస్తూంటారు. రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రఘునందన్‌ గంభీర ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా 22 రోజుల పాటు సంచరించే ఈ బస్సు ద్వారా 1,300 మంది పీజీ, జూనియర్‌ డాక్టర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. గత నెల 11న చైన్నెలో ప్రారంభమైన ఈ బస్సు విజయవాడ, ఏలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నంలోని వైద్య కళాశాలల్లోని పీజీలకు శిక్షణనిచ్చింది. కాకినాడ రంగరాయ వైద్య కళాశాలకు (ఆర్‌ఎంసీ) వచ్చి రెండు రోజుల శిక్షణ అనంతరం గుంటూరు బయల్దేరింది.

ఏం నేర్పారంటే..

రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్‌షాపులో లాప్రోస్కోపిక్‌ శస్త్రచికిత్స విధానాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. లైవ్‌ టిష్యూ, సిమ్యులేటర్లు, ట్యూబింగెన్‌ మోడల్‌పై అవగాహన కల్పించారు. లాప్రోస్కోపిక్‌ శస్త్రచికిత్స విధానాలైన ల్యాప్‌ ఫండోప్లికేషన్‌, ల్యాప్‌ బౌల్‌ అనాస్టమోసిస్‌, ల్యాప్‌ స్ప్లీనెక్టమీ, ల్యాప్‌ హిస్టరెక్టమీ, ల్యాప్‌ కొలిసిస్టెక్టమీలపై పీజీలు, జూనియర్‌ డాక్టర్లకు ప్రయోగాత్మక బోధన అందించారు. వీటితో పాటు నిత్యం నిర్వహించే సాధారణ శస్త్రచికిత్సల పైనా అవగాహన కల్పించారు. కళాశాల ప్రయోగశాలల్లో దొరకని ఆవు, పంది జంతువుల కణజాలాలతో శస్త్రచికిత్స ప్రక్రియలపై శిక్షణ ఇచ్చారు. ఈ రెండు జంతువుల కణజాలాలే ఎంచుకునేందుకు ప్రధాన కారణం వీటి దేహ నిర్మాణం మనుషుల దేహ నిర్మాణంతో సారూప్యత కలిగి ఉండటమేనని సర్జరీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సింహాద్రి చెప్పారు.

2 రోజులు... 70 మంది

రెండు రోజుల పాటు 70 మంది జూనియర్‌ డాక్టర్లు, పీజీలు ఈ శిక్షణ ప్రయోజనాలను అందిపుచ్చుకున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మొత్తం 10 బ్యాచ్‌లు ఈ శిక్షణలో పాల్గొన్నాయి. రంగరాయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అత్తలూరి విష్ణువర్ధన్‌ పర్యవేక్షణలో సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ హెచ్‌ఓడీలు పి.నరేష్‌కుమార్‌, అనురాగమయి, హరిణితో పాటు సర్జరీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆర్‌.హేమంతి విద్యార్థులకు బోధించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లావణ్యకుమారి, డెప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసన్‌, ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశి సమక్షంలో డీఎంఈ డాక్టర్‌ రఘునందన్‌ సోమవారం ఈ శిక్షణను ప్రారంభించారు. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ తరఫున ఏపీ రీజినల్‌ సేల్స్‌ మేనేజర్‌ మురళీకృష్ణ, జోనల్‌ మేనేజర్‌ పీకే రాజు పర్యవేక్షించారు.

ఫ రంగరాయ వైద్య కళాశాలలో

స్కిల్‌ ల్యాబ్‌ ఆన్‌ వీల్స్‌

ఫ వైద్య విద్యార్థులకు

రెండు రోజుల పాటు శిక్షణ

ఫ అధునాతన శస్త్రచికిత్సలపై

శిక్షణ పొందిన 70 మంది వైద్యులు

వైద్య విద్యార్థులకు వరం

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సౌజన్యంతో నిర్వహించిన స్కిల్‌ ల్యాబ్‌ శిక్షణ వైద్య విద్యార్థులకు ఓ వరం. జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, పీడియాట్రిక్‌ సర్జరీ పీజీలు, జూనియర్‌ వైద్యులు ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకొని లాప్రోస్కోపిక్‌ శస్త్రచికిత్స విధానాలను మరింత మెరుగుపరుచుకున్నారు. సంస్థ యాజమాన్యంతో పాటు ఏర్పాటుకు చొరవ చూపి, శిక్షణను ప్రారంభించిన డీఎంఈ డాక్టర్‌ రఘునందన్‌కు ధన్యవాదాలు.

– డాక్టర్‌ అత్తలూరి విష్ణువర్ధన్‌,

ప్రిన్సిపాల్‌, ఆర్‌ఎంసీ, కాకినాడ

ప్రాక్టీస్‌కు ఎంతో తోడ్పడుతుంది

స్కిల్‌ ల్యాబ్‌ బస్సులో ఇచ్చిన శిక్షణ ఎంతగానో తోడ్పడింది. లాప్రోస్కోపిక్‌ సిమ్యులేషన్‌ను పెంచింది. లాప్‌ పరికరాల నిర్వహణ, ఉపయోగించే తీరు, లాప్‌ ద్వారా సూచరింగ్‌ టెక్నిక్స్‌ కొత్తగా నేర్చుకోగలిగాం. ఆధునిక శస్త్రచికిత్స విధానాలపై అవగాహన పెరిగింది. రోగులకు శస్త్రచికిత్స సేవలు అందించే రోజువారీ ప్రాక్టీస్‌కు ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది.

– డాక్టర్‌ రొంగలి శ్రీలాస్య, పీజీ ఫస్టియర్‌,

జనరల్‌ సర్జన్‌, ఆర్‌ఎంసీ, కాకినాడ

జ్ఞాన పథం.. విజ్ఞాన రథం1
1/3

జ్ఞాన పథం.. విజ్ఞాన రథం

జ్ఞాన పథం.. విజ్ఞాన రథం2
2/3

జ్ఞాన పథం.. విజ్ఞాన రథం

జ్ఞాన పథం.. విజ్ఞాన రథం3
3/3

జ్ఞాన పథం.. విజ్ఞాన రథం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement