ప్రభుత్వం అన్నిటా విఫలం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. స్థానిక ఎన్జీఓ హోమ్‌లో జిల్లా కార్యదర్శి కె.బోడకొండ అధ్యక్షతన మంగళవారం జరిగిన సీపీఐ జిల్లా సమితి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో నిరుద్యోగులు, రైతులు, విద్యా రంగానికి కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు కావడం లేదని అన్నారు. పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలిస్తామని చెప్పి ఇప్పటి వరకూ దీనిపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడం దారుణమని దుయ్యబట్టారు. 2014లో చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్లు కట్టిస్తానని చెప్పి, నిర్మించిన ఇళ్లను తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని, దీనివలన పూర్తయిన ఇళ్లు కూడా లబ్ధిదారులకు అందని పరిస్థితి ఏర్పడిందని ఈశ్వరయ్య ఆరోపించారు. ఇప్పటికై న కట్టిన టిడ్కో ఇళ్లు వెంటనే లబ్ధిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. రోజుకు 14 గంటల పని వంటి కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడంపై ఈశ్వరయ్య మండిపడ్డారు. కార్మికులు దీర్ఘకాల పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ఒక్కొక్కటిగా హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ కార్మిక చట్టాల ఉల్లంఘనకు గానీ, కార్మికులతో ఎక్కువ గంటలు పని చేయించే వ్యవస్థకు గానీ సీపీఐ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. పెట్టుబడుల పేరుతో చంద్రబాబు, లోకేష్‌లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. విదేశీ పర్యటనలు చేస్తూ, పెట్టుబడులు వస్తున్నాయంటున్నారని, రాష్ట్రంలో ఒక్క పెద్ద పరిశ్రమయినా ప్రారంభమైందా, ఒక్క కొత్త ప్రాజెక్టు వచ్చిన ఆధారం ఉందా అని ఈశ్వరయ్య ప్రశ్నించారు. కార్పొరేట్ల పాలనకు ప్రజలు వెతుకుతున్న ప్రత్యామ్నాయం ఎరజ్రెండా పార్టీలేనని ఆయన స్పష్టం చేశారు.
ఖమ్మంలో సీపీఐ శతాబ్ది ఉత్సవాలు
సీపీఐ శతాబ్ది ఉత్సవాలు డిసెంబర్ 26న ఖమ్మంలో జరుగుతాయని, ఈ సందర్భంగా జరిగే భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని పార్టీ శ్రేణులు, వామపక్ష అభిమానులు, ప్రజాసంఘాల నేతలు, కార్యకర్తలు తరలి రావాలని ఈశ్వరయ్య కోరారు. పార్టీ శతాబ్దిక పోరాట గాథలు, కార్మిక, రైతు ఉద్యమాల్లో చేసిన త్యాగాలను స్మరించుకునే విధంగా ఈ ఉత్సవాలు జరుగుతాయని వివరించారు. దీనికి భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు మాట్లాడుతూ, శతవార్షికోత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం విస్తృత సామాజిక, రాజకీయ ఉద్యమానికి పార్టీ శ్రీకారం చుట్టబోతోందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొద్దిమంది కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ, ప్రపంచ కోటీశ్వరులకు సేవలందించే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని విమర్శించారు. ఆపరేషన్ కగార్ పేరుతో సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.సత్యనారాయణ, బొబ్బిలి శ్రీనివాసరావు, పప్పు ఆదినారాయణ, శాఖ రామకృష్ణ, ఎ.భవాని తదితరులు పాల్గొన్నారు. తొలుత స్థానిక ఆనంద భారతి గ్రౌండ్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్జీఓ హోమ్ వరకూ ప్రదర్శన నిర్వహించారు.
ఫ హామీలు అమలు కావడం లేదు
ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య


