సామర్లకోట: పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం వద్ద ఈ నెల 27 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకూ ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షేత్రం విశ్రాంతి భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే జగదీష్‌మోహన్‌రావు ఈ వివరాలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎర్నేని కుటుంబ సభ్యులు శివ, శ్యామ్, సునీతల ఆధ్వర్యాన నటరాజ నాట్యాంజలి (అమెరికా), శంకర నేత్రాలయం ఆధ్వర్యాన ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కంటి పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అవసరమైన వారికి అధునాతన సదుపాయాలతో కూడిన బస్సులోనే ఉచితంగా కంటి ఆపరేషన్లు చేస్తారన్నారు. ఆపరేషన్ జరిగిన రెండు గంటల్లోనే ఇంటికి పంపిస్తారని తెలిపారు. వారం రోజుల పాటు కంటి పరీక్షలకు హాజరయ్యే వారికి పంచారామ క్షేత్రం ఆధ్వర్యాన అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిర్వాహకులు శివ, సునీత మాట్లాడుతూ, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇస్తామని తెలిపారు. బయట కంటి ఆపరేషన్‌కు రూ.30 వేల వరకూ ఖర్చవుతుందని, తమ వాహనంలో డిసెంబర్ 1 ఉంచి 5వ తేదీ వరకూ ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని అన్నారు. చైన్నె రాకపోకలకు ఖర్చులు పెట్టుకుంటే అవసరమైన వారికి రూ.5 లక్షల విలువైన ఆపరేషన్ ఉచితంగా చేయిస్తామని చెప్పారు. కంటి శిబిరానికి వచ్చే వారు ఫోన్ నంబర్, ఆధార్ జెరాక్స్ కాపీలు తీసుకు రావాలని, బీపీ, సుగర్ బాధితులు వారు వాడుతున్న మందులు తీసుకు రావాలని సూచించారు. పూర్తి వివరాలకు 98481 74374, 99519 11111 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా కంటి శిబిరం కరపత్రాలను ఆవిష్కరించారు.


