కాస్త గండి.. అయినా దండి | - | Sakshi
Sakshi News home page

కాస్త గండి.. అయినా దండి

Nov 25 2025 10:20 AM | Updated on Nov 25 2025 10:20 AM

కాస్త

కాస్త గండి.. అయినా దండి

అన్నవరం: తుపాను ప్రభావంతో కాస్త గండి పడినా.. మొత్తం మీద ఈ ఏడాది కార్తిక మాసంలో సత్యదేవుని దండిగానే ఆదాయం సమకూరింది. లక్షలాదిగా వచ్చిన భక్తుల ద్వారా స్వామివారికి మొత్తం రూ.19,48,12,985 ఆదాయం వచ్చిందని అన్నవరం దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు చెప్పారు. రత్నగిరిపై సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. గత ఏడాది కార్తికంలో రూ.20,04,29,132 ఆదాయం వచ్చింది. ఈ ఏడాది కార్తికం ప్రారంభంలో వచ్చిన మోంథా తుపాను ప్రభావంతో మొదటి వారం రోజుల పాటు స్వామివారి సన్నిధికి భక్తులు పెద్దగా రాలేదు. ఫలితంగా ఆదాయం సుమారు రూ.56 లక్షలు తగ్గిందని ఈఓ తెలిపారు. అయితే, దేవస్థానంలో వివిధ దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితికి గాను 2024 కార్తికంలో నిర్వహించిన వేలంలో రూ.1.09 కోట్లు రాగా, ఈ కార్తికంలో జరిపిన వేలంలో రూ.2.23 కోట్లు వచ్చిందని తెలిపారు. ఇది కూడా కలిపితే 2024 కార్తికంలో రూ.21.14 కోట్లు రాగా.. ఈ ఏడాది కార్తికంలో అంతకు మించి రూ.21.76 కోట్లు ఆదాయం వచ్చిందని ఈఓ వివరించారు.

ఫ గత ఏడాది కార్తికంలో స్వామివారి వ్రతాలు 1,47,142 జరిగాయి. ఈ ఏడాది కార్తికం తొలి వారంలో తుపాను ప్రభావంతో భక్తులు పెద్దగా రాక 1,34,476 వ్రతాలు మాత్రమే జరిగాయి. ఇవి గత ఏడాది కార్తికం కన్నా 12,666 తక్కువ.

ఫ సత్యదేవుని వ్రతాల్లో 96,484 (70 శాతం) రూ.300 టికెట్టువే జరిగాయి. ఆ తరువాత రూ.వెయ్యి టికెట్టువి 16,099, రూ.1,500 వ్రతాలు 9,511, రూ.2 వేల వ్రతాలు 12,382 జరిగాయి.

ఫ సత్యదేవుని హుండీల ఆదాయాన్ని రెండో విడతగా సోమవారం లెక్కించగా రూ.1.78 కోట్లు వచ్చింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకూ స్వామివారి నిత్య కల్యాణ మండపంలో ఈ లెక్కింపు చేపట్టారు. ఈ నెల 7న తొలి విడత లెక్కింపులో రూ.1.73 కోట్లు వచ్చింది. దీంతో మొత్తం కార్తికంలో హుండీల ద్వారా రూ.3.51 కోట్ల ఆదాయం వచ్చింది.

ఫ కార్తిక మాసంలో భక్తుల కోసం ఇంజినీరింగ్‌ విభాగం ద్వారా రూ.81.88 లక్షలతో తాత్కాలిక విశ్రాంతి షెడ్లు, టాయిలెట్లు, క్యూలు ఇతర ఏర్పాట్లు చేశారు.

ఫ అలాగే, ఈ నెల 2న పంపా జలాశయంలో జరిగిన సత్యదేవుని తెప్పోత్సవం, 5న జరిగిన గిరి ప్రదక్షిణ కార్యక్రమాలకు విద్యుత్‌ విభాగం ద్వారా రూ.20 లక్షలతో విద్యుద్దీపాలంకరణ తదితర ఏర్పాట్లు చేశారు.

భక్తుల తాకిడి

రత్నగిరికి సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు తరలి వచ్చి, సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.

గత ఏడాది, ఈ ఏడాది కార్తిక మాసాల్లో దేవస్థానానికి విభాగాల వారీగా వచ్చిన ఆదాయం (రూ.కోట్లు)

విభాగం 2024 2025

వ్రతాలు 8.34 7.81

ప్రసాద విక్రయాలు 4.86 4.57

హుండీలు 3.04 3.51

సత్రాల అద్దెలు 1.43 1.23

ఆదాయం (రూ.లక్షల్లో)

ట్రాన్స్‌పోర్టు 41 39

దర్శనం టికెట్లు 86 90

కల్యాణ మండపాలు 8 6

ప్రసాదం బ్యాగ్‌లు 5 4

కల్యాణాలు 8 8

ఆర్జిత సేవలు 8 10

కేశఖండన 15 12

ఏసీ వ్రతాలు 60 62

కానుకలు 4 4

వివాహాలు 2 1

ఫ సత్యదేవునికి రూ.19,48 కోట్ల కార్తిక ఆదాయం

ఫ గత ఏడాది కంటే రూ.56 లక్షలు తక్కువ

ఫ ‘మోంథా’తో తగ్గిన రాబడి

కాస్త గండి.. అయినా దండి 1
1/2

కాస్త గండి.. అయినా దండి

కాస్త గండి.. అయినా దండి 2
2/2

కాస్త గండి.. అయినా దండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement