పరిశోధన.. వేదన | - | Sakshi
Sakshi News home page

పరిశోధన.. వేదన

Nov 25 2025 10:20 AM | Updated on Nov 25 2025 10:20 AM

పరిశో

పరిశోధన.. వేదన

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): వివిధ రంగాల్లో పరిశోధనలు జరిగితేనే ప్రపంచ ప్రగతి మరింత ముందుకు సాగుతుంది. అటువంటి పరిశోధనలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం నిరాశే మిగులుస్తోంది. పరిశోధనలకు సంబంధించిన పీహెచ్‌డీ కోర్సులలో నేరుగా అడ్మిషన్లకు ఉద్దేశించిన ఏపీ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) ఏడాదిన్నరకు పైగా నిర్వహించడం లేదు. రాష్ట్రంలో సెట్‌ తరహాలోనే యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఏటా జూన్‌, డిసెంబర్‌ నెలల్లో నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) నిర్వహిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించనుంది. యూజీసీ నెట్‌కు దేశవ్యాప్తంగా 7 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతూంటారు. యూజీసీ క్రమం తప్పకుండా నెట్‌ నిర్వహిస్తున్నా మన రాష్ట్రంలో మాత్రం సెట్‌ ఊసే లేకుండా పోయింది. సీఎం చంద్రబాబు తనయుడు లోకేషే స్వయంగా విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సెట్‌పై దృష్టి సారిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. పైగా, కనీసం క్యాలెండర్‌ ప్రకారం ప్రవేశ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది.

తిరోగమనంలో విద్యారంగం

చంద్రబాబు సర్కారు అధికారం చేపట్టినప్పటి నుంచీ రాష్ట్రంలో విద్యారంగం తిరోగమనంలో పయనిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్యా కోర్సులలో ప్రవేశాలకు సంబంధించి 2025–26 విద్యా సంవత్సరంలో మునుపెన్నడూ లేని రీతిలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గత నెలాఖరు వరకూ ఇంజినీరింగ్‌ అడ్మిషన్లు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు డిగ్రీ స్పాట్‌ అడ్మిషన్ల పేరుతో ఈ నెలలో కూడా ఇంకా నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏపీ సెట్‌ నిర్వహణలోనూ అదే తీరు అవలంబించడంపై విద్యార్థులు, విద్యావేత్తల నుంచి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తూండటంతో విద్యార్థులు తీరని నిరాశకు గురవుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డిగ్రీ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు ఏపీ సెట్‌ లేదా నెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. లేదా పీహెచ్‌డీ చేసిన వారు అర్హులు. ఏపీ సెట్‌కు పీజీ పూర్తి చేసిన వారు లేదా పీజీ చివరి సంవత్సరం చదువుతున్న వారు అర్హులు. ఏటా వేలాది మంది రాసే ఏపీ సెట్‌లో అప్పుడే పీజీ పాసైన విద్యార్థుల నుంచి వివిధ వృత్తులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు సైతం పోటీ పడుతున్న దాఖలాలున్నాయి. చివరిసారిగా గత ఏడాది ఏప్రిల్‌లో ఏపీ సెట్‌ నిర్వహించారు. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించాల్సి ఉండగా ఇప్పటి వరకూ దీనిపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు. సాధారణంగా నెట్‌, సెట్‌ అర్హత సాధించిన వారికి వివిధ విశ్వవిద్యాలయాలు ఇంటర్నల్‌ నోటిఫికేషన్‌ ద్వారా నేరుగా పీహెడీ అడ్మిషన్‌ కల్పిస్తూంటాయి. కానీ, ఈ ఏడాది సెట్‌ నిర్వహించకపోవడంతో యూనివర్సిటీలు ఇంటర్నల్‌ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తమ జీవితాలతో చెలగాటమాడటం ప్రభుత్వానికి తగదని వాపోతున్నారు.

సెట్‌ నిర్వహించాలి

అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం సెట్‌లు నిర్వహించి, విద్యార్థుల సమయం వృథా కాకుండా అడ్మిషన్లు కల్పించాలి. సమయానికి పరీక్షలు నిర్వహించనందువలన ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి నిరాశ ఎదురవుతోంది. క్యాలెండర్‌ ప్రకారం పీహెడ్‌డీ ప్రవేశాలకు క్రమం తప్పకుండా సెట్‌ నిర్వహించాలి.

– ఎం.గంగా సూరిబాబు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి

విద్యార్థులకు నిరాశ

పీజీ పూర్తి చేసి, వివిధ విభాగాల్లో పీహెచ్‌డీ చేద్దామనుకుంటున్న వారికి నిరాశే ఎదురవుతోంది. సెట్‌ నిర్వహిస్తేనే కానీ ఆయా వర్సిటీలు పీహెచ్‌డీ అ డ్మిషన్లు కల్పించలేని పరిస్థితి. ఈ విషయంలో జాప్యం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని, పరిశోధక విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడాలి.

– కె.సాయిబాబు, లైబ్రేరియన్‌, కాకినాడ

నూతన రీసెర్చ్‌ ప్రాజెక్టులేవీ?

మరోవైపు జేఎన్‌టీయూకేతో పాటు ఆదికవి నన్నయ వంటి యూనివర్సిటీల్లో నూతన రీసెర్చ్‌ ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. ఏటా జేఎన్‌టీయూకే ద్వారా రెగ్యులర్‌, పార్ట్‌టైం విధానంలో దాదాపు 350 వరకూ పీహెడ్‌డీ అడ్మిషన్లు కల్పిస్తారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ద్వారా గతంలో ఇబ్బడిముబ్బడిగా పరిశోధన ప్రాజెక్ట్లులు వచ్చేవి. ప్రస్తుతం రీసెర్చ్‌ ప్రాజెక్టులు లేక వర్సిటీలు బోసిపోతున్నాయి. కొత్త ప్రాజెక్ట్లులు వస్తే వాటి కింద అడ్మిషన్లు కల్పించి పీహెచ్‌డీ పట్టా అందించవచ్చు. వర్సిటీకి బోధన, పరిశోధన, సామాజిక బాధ్యత ముఖ్యమైన విధులు. బోధించడానికి ఇక్కడ తగినంత మంది ప్రొఫెసర్లూ లేరు. పరిశోధనకు కొత్త ప్రాజెక్ట్లులూ లేవు. రీసెర్చ్‌ ప్రాజెక్ట్లు కావాలని దరఖాస్తు చేసినా.. ఢిల్లీ స్థాయికి వెళ్లి ప్రాజెక్టు తెచ్చేంత చొరవ ఎవ్వరూ తీసుకోవడం లేదు. రీసెర్చ్‌ ప్రాజెక్టు, పేటెంట్లతో తమకేమీ సంబంధం లేనట్టుగా వర్సిటీ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

ఫ క్యాలెండర్‌ ప్రకారం జరగని ప్రవేశ పరీక్షలు

ఫ గత ఏడాది ఏప్రిల్‌లో చివరిసారిగా ‘సెట్‌’

ఫ ఏడాదిన్నరగా జాప్యం చేస్తున్న ప్రభుత్వం

ఫ నిలిచిపోయిన రీసెర్చ్‌ అడ్మిషన్లు

పరిశోధన.. వేదన1
1/2

పరిశోధన.. వేదన

పరిశోధన.. వేదన2
2/2

పరిశోధన.. వేదన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement