పేరు మారినా.. తీరు మారలే..
అన్నవరం: రామేశ్వరం వెళ్లినా శనేశ్వరం తప్పలేదన్నట్టుగా ఉంది అన్నవరం దేవస్థానం పారిశుధ్య సిబ్బంది పరిస్థితి. దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణను తిరుపతికి చెందిన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సంస్థ గత అక్టోబర్ నుంచి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అన్నవరం దేవస్థానం సహా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల శానిటేషన్ కాంట్రాక్ట్‌ను ఆ సంస్థ చేజిక్కించుకుంది. అయితేనేం! నవంబర్ 24వ తేదీ వచ్చేసినప్పటికీ అక్టోబర్ నెల వేతనాలు జమ కాకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గతంలో గుంటూరుకు చెందిన కనకదుర్గ సంస్థ శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్ట్ నిర్వహించినప్పుడు కూడా ఇదే విధంగా జీతాలు ఆలస్యమయ్యేవి. దీనిపై అప్పట్లో ‘సాక్షి’లో కథనాలు రావడం.. ఆ తరువాత వేతనాలు చెల్లించడం జరిగేది. ప్రస్తుతం ‘పద్మావతి’ సంస్థలో సుమారు 350 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వారికి జీతాల రూపంలో సుమారు రూ.60 లక్షలు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకూ ఆ ఊసే లేకుండా పోయింది. నిర్వహణ సంస్థ పేరు మారిందే తప్ప తమ తలరాతలు మాత్రం మారడం లేదని పారిశుధ్య సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.
వీఐపీ ట్రీట్‌మెంట్ అందుకేనా!
‘పద్మావతి’ సంస్థ యజమాని భాస్కరనాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడనే ప్రచారం 2014 నుంచి ఉంది. 2014లో చంద్రబాబు సీఎం అయినప్పుడు కూడా దేవస్థానాల శానిటేషన్ కాంట్రాక్ట్ ఈ సంస్థకే దక్కింది. ఇప్పుడు కూడా ఆయనే దక్కించుకున్నారు. అన్నవరం సహా అన్ని దేవస్థానాల్లోనూ భాస్కరనాయుడుకు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్నారనే విమర్శలున్నాయి. దీనికి తగినట్టుగానే ఆయా దేవస్థానాల అధికారులు ఆయన వద్దకే శానిటేషన్ అగ్రిమెంట్ పత్రాలు తీసుకువెళ్లి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అన్నవరం దేవస్థానానికి ఆయన గత నెల 24న వచ్చారు. అప్పుడు అగ్రిమెంట్ కుదుర్చుకోలేదు. ఆయన మళ్లీ ఇక్కడకు రాలేదు. ఈ నేపథ్యంలో దేవస్థానం అధికారులే ఆయన వద్దకు అగ్రిమెంట్ పత్రాలు పట్టుకుని వెళ్లడం గమనార్హం.
జీతాలు త్వరలో చెల్లిస్తాం
శానిటేషన్ సిబ్బందికి సంబంధించి అక్టోబర్ నెల జీతాల బిల్లు తయారు చేశాం. అవసరమైన ప్రొసీజర్లు పూర్తి చేసిన వెంటనే జీతాలు చెల్లిస్తాం. అక్టోబర్ నెలలో ఎంత మంది పని చేశారో అటెండెన్స్ ఉంది. ఆ ప్రకారమే చెల్లిస్తాం. కాంట్రాక్టర్‌తో ఇంతవరకూ అగ్రిమెంట్ చేసుకోని విషయం వాస్తవమే. అగ్రిమెంట్ పత్రాలతో సిబ్బంది ఆయన వద్దకు వెళ్లారు. కాంట్రాక్టర్ సంతకం చేసిన వెంటనే నేను కూడా సంతకం చేస్తా. డిసెంబర్ నుంచి మొదటి వారంలోనే పారిశుధ్య సిబ్బందికి జీతాలు చెల్లిస్తాం.
– వీర్ల సుబ్బారావు,
ఈఓ, అన్నవరం దేవస్థానం
ఫ ఇప్పటికీ అందని అక్టోబర్ జీతాలు
ఫ అన్నవరం దేవస్థానంలో
పారిశుధ్య సిబ్బంది దుస్థితి
అగ్రిమెంట్‌కు తీరుబాటే లేదు!
గత నెల నుంచే పద్మావతి సంస్థ శానిటేషన్ కాంట్రాక్టు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటి వరకూ ఆ సంస్థతో దేవస్థానం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కుదుర్చుకోకపోవడం విచిత్రం. అగ్రిమెంట్ లేకుండానే దాదాపు రెండు నెలలుగా ఆ సంస్థ తరఫున సిబ్బంది పని చేస్తూండటం గమనార్హం. ఎంత మంది పని చేస్తున్నారనే దానికి ఏ ఆధారమూ లేదు. దేవస్థానం అధికారులు చెప్పినంత మందికి ఆ సంస్థ జీతాలు చెల్లించాల్సి ఉంటుంది. దేవస్థానంలో విధులు నిర్వహించే సిబ్బందికి అటెండెన్స్ వేస్తున్నామని, ఆ ప్రకారమే జీతాలు చెల్లించాల్సిందిగా కాంట్రాక్ట్ సంస్థకు చెబుతామని అధికారులు అంటున్నారు.


