ఏం చేశారని మాకోసం? | - | Sakshi
Sakshi News home page

ఏం చేశారని మాకోసం?

Nov 24 2025 7:58 AM | Updated on Nov 24 2025 7:58 AM

ఏం చే

ఏం చేశారని మాకోసం?

కాకినాడ రూరల్‌: ఆరుగాలం శ్రమించి.. అందరికీ తిండి గింజలు పండిస్తున్న అన్నదాతకు అడుగడుగునా కడగండ్లు తప్పడం లేదు. విత్తు వేసి.. ప్రకృతి విపత్తులకు ఎదురీది.. ఎలాగోలా సిరుల పంటలు పండించినా.. వచ్చిన దిగుబడిని అమ్ముకుందామంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. అడుగడుగునా దగా పడుతున్న రైతన్న ఇక్కట్లను సర్కారు పట్టించుకోవడం లేదు. ‘అన్నదాత సుఖీభవ’ కింద రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల వేళ చెప్పి, ఓట్లు దండుకుని, తొలి ఏడాది ఈ పథకానికి మంగళం పాడారు. రెండో ఏడాది అనేక కోతలు, కొర్రీలు పెట్టి అరకొరగానే విదిల్చారు. విపత్తులతో నష్టపోతే పరిహారం ఊసే లేదు. ఉచిత పంటల బీమాకు స్వస్థి పలికారు. ధాన్యం కొనుగోళ్లలోనూ సవాలక్ష నిబంధనలతో ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకూ చేసిందేమీ లేకపోయినా.. ఏవేవో చేసేశామని చెప్పుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు సిద్ధపడుతోంది.

జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకూ ‘రైతన్నా... మీకోసం’ వారోత్సవాల పేరిట కొత్త రాగంతో ప్రచారానికి ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రతి రైతు ఇంటికీ వెళ్లి వారి జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధిలో శాశ్వత మార్పు తదితర అంశాలపై వివరాలు సేకరించనున్నారు. ఆ వివరాలను ఈ నెల 30 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ పరిశీలిస్తారు. అదే రోజు రైతు సేవా కేంద్రాల్లో వర్క్‌షాపులు పెట్టి, రానున్న రబీ, వచ్చే ఏడాది ఖరీఫ్‌, రబీ పంటలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. అయితే, దాదాపు ఏడాదిన్నర పాలనలో ‘ప్రచారార్భాటం పీక్‌.. ఆచరణ వీక్‌’ అనే రీతిలో వ్యవహరిస్తున్న ప్రభుత్వాధినేతలు, అధికారులు.. తమకు చేసిందేమీ లేకున్నా, ఇప్పుడు తమ ముందుకు ఎందుకొస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది పెట్టుబడి సాయం, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం అందజేసి, ఉచిత పంటల బీమా అమలు చేసి తమ వద్దకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అడుగడుగునా దగా

● ఎన్నికల ముందు బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌ గ్యారెంటీ పేరిట సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రకటించారు. వీటిలో ఒకటి అన్నదాత సుఖీభవ. దీని కింద రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పగా చెప్పారు. తీరా చూస్తే తొలి ఏడాది ఈ పథకం అమలును పక్కన పెట్టేసి, జిల్లాలోని రైతులకు సుమారు రూ.300 కోట్ల మేర జెల్ల కొట్టారు.

● అన్నదాత సుఖీభవ పథకాన్ని రెండో ఏడాది అరకొరగా మాత్రమే అమలు చేశారు. లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో జిల్లావ్యాప్తంగా ఏటా 1.80 లక్షల మంది రైతులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరింది. ప్రస్తుత ప్రభుత్వంలో సుమారు 30 వేల మంది లబ్ధిదారులకు రకరకాల కొర్రీలతో ఈ పథకం అమలు చేయలేదు. 1,50,475 మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించారు.

● గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతుభరోసా పథకం వర్తింపజేసింది. జిల్లాలో సుమారు 65 వేల మంది కౌలు రైతులుండగా కౌలు గుర్తింపు కార్డులు పొందిన సుమారు 15 వేల మంది అప్పట్లో రైతుభరోసా లబ్ధిని అందుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఖరీఫ్‌ ముగింపు దశకు చేరుకున్నా కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సొమ్ము నయా పైసా కూడా విదల్చలేదు.

● గత ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులకు అందించింది. రైతులపై ప్రీమియం భారం పడకుండా ఆ మొత్తాన్ని నాటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వమే భరించింది. దీనివలన అప్పట్లో ప్రకృతి విత్తులతో పంటలు నష్టపోయిన రైతులకు ఎంతో మేలు జరిగింది. ఇటువంటి పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. రైతుల భాగస్వామ్యం పేరిట పంటల బీమా ప్రీమియం భారాన్ని వారి పైనే మోపింది. ఈ భారం మోయలేక జిల్లాలోని 40 శాతం మంది రైతులు పంటల బీమాకు దూరమయ్యారు. విపత్తులతో ఇటు పంటలు దెబ్బ తినగా.. అటు బీమా పరిహారం కూడా రాకపోవడంతో వీరు నష్టపోయారు.

● ఖరీఫ్‌లో అదునుకు యూరియా లభించక జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు నానా అగచాట్లూ పడ్డారు.

● గత నెలలో మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో 46,929 మంది రైతులు రూ.148 కోట్ల మేర పంట నష్టపోయారు. కానీ, ప్రభుత్వం రూ.52 కోట్లుగానే అంచనా వేసింది. దీంతో, బాధితులకు తీరని నష్టం జరగనుంది.

● ఇక ధాన్యం కొనుగోళ్ల సమయంలోనూ రైతులు దగా పడుతున్నారు. ఈ విషయం గత ఖరీఫ్‌, రబీతో పాటు ప్రస్తుత ఖరీఫ్‌లో కూడా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వం ఎ–గ్రేడ్‌ రకం ధాన్యం 75 కేజీల బస్తాకు రూ.1,792, సాధారణ రకానికి రూ.1,777 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించింది. కానీ, తేమ శాతం నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది. ఫలితంగా ఇటీవలి మోంథా తుపానుతో తడిసి, రంగు మారిన ధాన్యం అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులూ పడుతున్నారు. రైతు సేవా కేంద్రానికి వెళ్తే సవాలక్ష నిబంధనలు చెబుతూండటంతో.. ఆ బాధలు పడలేక అయినకాడికి దళారులకే అమ్ముకోవాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇదే అదనుగా దళారులు బస్తాకు సుమారు రూ.250 నుంచి రూ.400 వరకూ కోత పెడుతున్నారు.

● వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ కింద గత ప్రభుత్వం రైతులకు ఎంతో లబ్ధి చేకూర్చింది. చంద్రబాబు ప్రభుత్వం ఈ రాయితీని పూర్తిగా ఎగ్గొట్టింది.

● రైతుకు అండగా నిలిచే లక్ష్యంతో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వాటి ద్వారా విత్తు నుంచి పంట విక్రయం వరకూ రైతులకు తోడుగా నిలిచింది. వీటిని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.

● మరోవైపు ఆక్వా రంగం పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అటు ఉద్యాన రైతులు సైతం గిట్టుబాటు ధర దక్కక నష్టపోతున్నారు.

● ఇంత జరుగుతున్నా పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని రైతులు వాపోతున్నారు.

పుట్టెడు కష్టాల్లో పుడమి పుత్రులు

అన్నదాత సుఖీభవకు

తొలి ఏడాది మంగళం

రెండో ఏడాది కోత

ఉచిత పంటల బీమా ఎత్తివేత

ధాన్యం కొనుగోళ్లలో దగా

ఆక్వా, ఉద్యాన రైతులదీ ఇదే దుస్థితి

ఈ పరిస్థితుల్లోనే ‘రైతన్నా.. మీకోసం’

అంటూ ప్రభుత్వం ప్రచారార్భాటం

నేడు ప్రారంభం

రైతులను తప్పుదారి పట్టించేందుకే..

రాష్ట్ర ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతూ ఇప్పుడు ‘రైతన్నా మీకోసం’ అంటూ రైతుల ఇళ్లకు వ్యవసాయాధికారులను పంపించడం హాస్యాస్పదంగా ఉంది. రైతులకు విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా ఇవ్వలేని ఈ ప్రభుత్వం పండించిన పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర కూడా కల్పించలేకపోతోంది. రైతులకు పంట నష్టపరిహారంతో పాటు కౌలు కార్డులు, రైతు రుణాలకు సైతం ఎగనామం పెట్టింది. ఇప్పుడు రైతులను తప్పుదారి పట్టించేందుకే రైతన్నా మీకోసం కార్యక్రమానికి తెర తీసింది. ఈ ప్రభుత్వంపై రైతులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

– లంక ప్రసాద్‌, వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు

ఏం చేశారని మాకోసం?1
1/1

ఏం చేశారని మాకోసం?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement