రత్నగిరికి భక్తుల తాకిడి
అన్నవరం: రత్నగిరికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున రత్నగిరి పైన, ఇతర ప్రాంతాల్లోను పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు, ఇతర భక్తులు కూడా సత్యదేవుని దర్శనానికి తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో సప్త గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణునికి పూజలు చేశారు. రావి చెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, ప్రదక్షిణ చేశారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.
కన్నుల పండువగా రథోత్సవం
సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవా రి రథోత్సవం ఆలయ ప్రాకారంలో ఘనంగా ని ర్వహించారు. ఉదయం 10 గంటలకు రథాన్ని తూర్పురాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం మేళతాళాల మధ్య ఆ రథంపై స్వా మి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు వేంచేయించి, పూజలు చేశారు. అనంతరం కొబ్బ రికాయ కొట్టి రథ సేవ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వెంట రాగా మూడుసార్లు ఆల య ప్రాకారంలో రథ సేవ ఘనంగా నిర్వహించా రు. అనంతరం స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
లోవలో భక్తుల రద్దీ
తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో రద్దీ నెలకొంది. కార్తిక మాసం ముగియడం, ఆదివారం కావడంతో వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూ ద్వారా 13 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల ద్వారా రూ.1,56,645, పూజా టికెట్లకు రూ.1,54,390, కేశఖండన శాలకు రూ.11,120, వాహన పూజలకు రూ.7,940, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.39,745, విరాళాలు రూ.58,028 కలిపి మొత్తం రూ.4,27,868 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు.
రత్నగిరికి భక్తుల తాకిడి


