పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం | - | Sakshi
Sakshi News home page

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం

Nov 23 2025 6:05 AM | Updated on Nov 23 2025 6:05 AM

పాలకు

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం

-8లో..
ఆదివారం శ్రీ 23 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

సత్యసాయి స్ఫూర్తి..

నిత్య సేవల వ్యాప్తి

సత్యసాయి సేవా సమాజాలు సుమారు 50 సంవత్సరాలుగా దీనుల సేవలో తరిస్తూ వారి మన్ననలు పొందుతున్నాయి.

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే అతి పెద్ద వైద్యాలయం కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్‌). ఇక్కడకు నిత్యం 2 వేల నుంచి 3 వేల మంది నిరుపేద రోగులు రకరకాల అనారోగ్య సమస్యలతో వస్తూంటారు. ఈ సంఖ్య శని, సోమవారాల్లో అయితే 3 వేలు దాటేస్తుంటుంది కూడా. ఇంతటి కీలకమైన ఆస్పత్రికి ప్రభుత్వ పర్యవేక్షణా లోపమే శాపంగా మారుతోందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధులు కాకినాడ జీజీహెచ్‌తో పాటు జిల్లాలోని ఇతర ఆస్పత్రులను తరచుగా సందర్శించేవారు. ఆకస్మిక తనిఖీలు చేసేవారు. దీంతో, వైద్యులు, సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉంటూ రోగులకు మెరుగైన సేవలు అందించేవారు. నాటి ప్రభుత్వం ఆస్పత్రుల అభివృద్ధికి సైతం పెద్దపీట వేయడంతో రోగులకు ఆధునిక వైద్య సేవలు సైతం ఉచితంగా అందేవి. అయితే, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా గాలికొదిలేసిన పరిస్థితి కనిపిస్తోంది. కూటమి ప్రజాప్రతినిధులు కానీ, ఉన్నతాధికారులు కానీ జీజీహెచ్‌ వైపు కన్నెత్తి చూసిన దాఖాలాలు లేవు. దీంతో, కొంత మంది వైద్యులు, సిబ్బంది సేవల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా రోగమొచ్చి ఆస్పత్రికి వెళ్తే చావు తప్పదేమోననే దయనీయ పరిస్థితులు జీజీహెచ్‌తో పాటు జిల్లాలోని చాలా ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్నాయి. ఇది మొత్తం వైద్య వృత్తికి, జీజీహెచ్‌కు కళంకం తెస్తోంది.

వరుస మరణాలు

జీజీహెచ్‌లో కొందరు వైద్యుల నిర్లక్ష్యానికి 4 నెలల్లో 5 నిండుప్రాణాలు బలైపోయాయి.

ఆగస్టు మొదటి వారంలో కాకినాడ జగన్నాథపురానికి చెందిన 21 ఏళ్ల వివాహిత పలపాల సుధారాణి జీజీహెచ్‌ గైనకాలజీ విభాగంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం పల్మనరీ ఎడిమాకు గురైన ఆమెకు వైద్యులు తక్షణ వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చూపారు. దీంతో సుధారాణి మృతి చెందింది. ఆమె మరణంతో ఐదేళ్ల కుమారుడు, నెలన్నర పాప తల్లి లేని వారయ్యారు.

అదే నెల మూడో వారంలో కాకినాడ దేవాలయం వీధికి చెందిన 55 ఏళ్ల మహిళ హృద్రోగంతో జీజీహెచ్‌ కార్డియాలజీ విభాగంలో చేరింది. ఆహారం తీసుకోలేని పరిస్థితి. దీంతో, ఆహారాన్ని కడుపులోకి పంపించేందుకు రైల్స్‌ ట్యూబ్‌ వేశారు. దీనిని నిర్లక్ష్యంగా వేయడంతో ట్యూబు చివరి భాగం కడుపులోకి కాకుండా ఊపిరితిత్తుల్లోకి వెళ్లింది. కనీసం ఈ విషయం కూడా గమనించకుండా ట్యూబు ద్వారా పాలు పోశారు. దీంతో ఆమె ఒక్కసారిగా ఊపిరాడక పొలమారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విషయం బయటకు రాకుండా బాధ్యులు సర్దుబాటు చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

సెప్టెంబర్‌ నెలలో కాకినాడకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి చిన్నపాటి థైరాయిడ్‌ సమస్యతో జీజీహెచ్‌కు వచ్చాడు. మెడికల్‌ వార్డులో చికిత్స పొందుతున్న అతడి మధుమేహం, రక్తపోటును వైద్య సిబ్బంది సక్రమంగా పర్యవేక్షించలేదని, అతడు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు అప్పట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పట్టణంలోని రథాలపేటకు చెందిన 20 ఏళ్ల వివాహిత రాయుడు కవితకు ఇంగ్వినల్‌ హెర్నియా (తొడ, పొత్తి కడుపు కలిసే భాగంలో దేహ అంతర్భాగం కొంత మేర ఉబ్బడం) సమస్య వచ్చింది. వైద్యపరంగా ఇది చాలా సాధారణ సమస్య అని, చిన్న శస్త్రచికిత్సతో తగ్గిపోతుందని పిఠాపురం వైద్యులు చెప్పారు. దీంతో, కవిత ఈ నెల 10న కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. వైద్యులు ఆమెకు ఈ నెల 15న శస్త్రచికిత్స చేశారు. సాయంత్రం 5.40 గంటలకు కవిత చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. జీజీహెచ్‌కు నడిచి వచ్చిన యువతి వైద్యుల నిర్లక్ష్యంతో ఐదు రోజుల్లో విగతజీవిగా మారిందని సహ రోగులు, కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.

తాళ్లరేవు మండలం గాడిమొగ గ్రామానికి చెందిన వివాహిత పెసింగి మల్లీశ్వరి (31) రెండోసారి గర్భం దాల్చింది. ఎనిమిదో నెలలో సాధారణ పరీక్షల కోసం ఈ నెల 14న కాకినాడ జీజీహెచ్‌లో చేరింది. ఆ సందర్భంగా తనకు పడని మందుల జాబితాను వైద్యులకు ఇచ్చింది. వారు అభినందించి, ఆ మందుల వివరాలు కేస్‌ షీటులో రాసుకున్నారు. కానీ, ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం తనకు ప్రమాదకరమని ఆమె రాసిచ్చిన పాంటాప్రొజోల్‌ ఇంజెక్షన్‌ను కుటుంబ సభ్యులు వద్దని వారిస్తున్నా ఇచ్చారు. దీంతో, మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మల్లీశ్వరి కుప్పకూలిపోయింది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఆమె గర్భంలోని శిశువు గుండె ఆగిపోయిందని వైద్యులు చెప్పారు. అపస్మారక స్థితికి చేరుకున్న మల్లీశ్వరికి వైద్యులు సీపీఆర్‌, ఇతర వైద్య ప్రక్రియలు చేసినా ఫలితం లేకపోయింది. వైద్యులు హైడ్రామా నడిపి రాత్రి 11 గంటల సమయంలో మల్లీశ్వరి చనిపోయిందని వైద్యులు చెప్పారు.

మరోవైపు కాకినాడ జీజీహెచ్‌లో మాదిరిగానే అక్టోబర్‌ 5న తుని ఏరియా ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ బాలింత నిండు ప్రాణాలు కోల్పోయింది. తుని రూరల్‌ తిమ్మాపురానికి చెందిన రత్నకుమారి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది.

ఆ సమయంలో సకాలంలో సరైన వైద్యం అందించకపోవడంతో ఆమె మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ప్రసవానంతరం బ్లీడింగ్‌ అవుతోందని చెప్పినా వైద్యులు ఉదాసీనంగా వ్యవహరించడమే రత్నకుమారి ప్రాణాలు కోల్పోవడానికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.

చేతులు కాలాక..

నాలుగు నెలల వ్యవధిలోనే ఒక్క జీజీహెచ్‌లోనే ఐదు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోవడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇంత మంది రోగులు మృతి చెందిన తరువాత విచారణ, వైద్యులు, సిబ్బందిపై చర్యలు అంటూ హడావుడి చేస్తోంది. ఈ మేరకు చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి, చర్యలకు ఆదేశించినట్లు ప్రకటించారు. వాస్తవానికి జీజీహెచ్‌లో వరుస మరణాలకు ప్రభుత్వం ఇన్నాళ్లు అనుసరిస్తున్న ఉదాసీన వైఖరి, పర్యవేక్షణ లోపమే కారణమని, దీనిపై ముందుగానే ఎందుకు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్‌లో 50కి పైగా విభాగాలుంటాయి. ఏటా 250 మంది వైద్యులను అందించే ప్రతిష్టాత్మక రంగరాయ వైద్య కళాశాలకు ఇది బోధనాస్పత్రి. ఇక్కడ 200 మందికి పైబడి వైద్యులు (ప్రొఫెసర్‌లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు), 250 మంది జూనియర్‌ వైద్యులు (మెడికోలు) ఉన్నారు. ఇంత మంది ఉన్నా మరణాలు చోటు చేసుకోవడానికి ప్రభుత్వ పర్యవేక్షణా లోపమే కారణమని పలువురు ఆక్షేపిస్తున్నారు. పైగా చిన్న వయసు రోగులు సైతం చనిపోతూండటం ఇటీవల వివాదాస్పదమవుతోంది. సర్జరీ టేబుల్‌పై ప్రాణాలు పోయిన రోగులను కూడా వివాదం అవుతుందన్న కారణంతో టేబుల్‌ డెత్‌ ప్రకటించక, ఐసీయూకు తరలించి, కాసేపటికి డెత్‌ డిక్లేర్‌ చేస్తున్నారన్న ఆరోపణలు తరచూ వస్తున్నాయి.

కీలక శస్త్రచికిత్సలను పీజీలతో చేయిస్తున్నారని, పై స్థాయి వైద్యులు నామమాత్రానికే పరిమితమవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. పలు వార్డుల్లో మెడికోలు అందించే వైద్య సేవలపై అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్లు, హెచ్‌ఓడీల స్థాయిలో నిరంతర పర్యవేక్షణ లేనందువల్లనే ఇటువంటి సంఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు.

జీజీహెచ్‌ పర్యవేక్షణను

గాలికొదిలేసిన సర్కారు

అటువైపు కన్నెత్తి కూడా చూడని ప్రజాప్రతినిధులు, అధికారులు

ఫలితంగానే సేవల్లో కొందరు

వైద్యుల నిర్లక్ష్యం

4 నెలల్లో 5 నిండు ప్రాణాలు బలి

ఇప్పుడు వరుస మరణాలతో

ఇరకాటంలో ప్రభుత్వం

వైద్యులు, సిబ్బందిపై విచారణ,

చర్యలు అంటూ హడావుడి

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం1
1/6

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం2
2/6

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం3
3/6

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం4
4/6

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం5
5/6

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం6
6/6

పాలకుల నిర్లక్ష్యమే.. పేదలకు శాపం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement