తొలి తిరుపతిలో భక్తుల రద్దీ
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండలంలో తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిరుపతి గ్రామం శనివారం భక్తులతో రద్దీగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు ఇక్కడ స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామివారిని కన్నులారా దర్శించుకున్నారు. అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి, ముడుపులు, మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.1,32,900, అన్నదాన విరాళాలు రూ.48,762, కేశఖండనకు రూ.9,560, తులాభారం ద్వారా రూ.250, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.21,330 కలిపి మొత్తం రూ.2,12,802 ఆదాయం వచ్చిందని వివరించారు. మూడు వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. స్వామివారికి అర్చకుడు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు పూజాదికాలు నిర్వహించి, విశేషంగా అలంకరించారు.
రేపటి నుంచి ‘రైతన్నా మీకోసం’
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలోనూ సోమవారం నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకూ ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు ప్రతి రైతు ఇంటినీ సందర్శిస్తారన్నారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు, దిగుబడులు, వారి అవసరాలకు సంబంధించిన సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేస్తారని వివరించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు, ఇతర అంశాలను ఈ కార్యక్రమంలో వివరించాలన్నారు. ప్రతి గ్రామానికీ ప్రత్యేక బృందాలను నియమించి, ఇంటింటికీ వెళ్లి జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. ఈ నెల 29 వరకూ జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు ఇంటినీ సందర్శించాలని, 30 నుంచి వచ్చే నెల 3 వరకూ రైతుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించాలని తెలిపారు. వచ్చే నెల 3న రైతు సేవా కేంద్రాల్లో స్థానిక రైతులతో సమావేశం నిర్వహించి, రబీ, వచ్చే ఖరీఫ్, ఆ తరువాత వచ్చే రబీకి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
నేడు సత్య సాయిబాబా
శత జయంతి వేడుకలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): భగవాన్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు జిల్లా స్థాయిలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కలెక్టరేట్ వివేకానంద హాలులో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ అన్ని విభాగాల అధిపతులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.


