రాష్ట్రంలో మొన్న టమాటా, నేడు అరటి వంటి పంటలకు కోత సొమ్ము కూడా రాక రైతులు చేలను, తోటలను దుక్కులు దున్నేసి నిరసన తెలుపుతున్నారు. వీటితోపాటు పలు పంటలకు కనీస మద్దతు రాకపోవడంతో రైతులు పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలవుతున్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు చేయడం లేదు సరికదా.. పంటలు కొనుగోలు చేసే దళారులను నియంత్రించకపోవడంతో మార్కెట్‌లో ధరల నిర్ణయం ఇష్టానుసారంగా ఉంది. కోనసీమ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ చూస్తున్నప్పటికీ జిల్లా రైతులకు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. పంట పోతున్నా పెట్టుబడి రాయితీ అందకపోవడం, ఉచిత బీమా ఎత్తేయడం వల్ల పరిహారం అందకపోవటం, ధరలు పడిపోవడం రైతులను కుంగదీస్తోంది.
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కనీస మద్దతు ధరల కల్పనకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి బడ్జెట్‌లో రూ.3 వేల కోట్లు కేటాయించింది. అనంతపురం, కడప తదితర జిల్లాల్లో టమాట, అరటి ధరలు తగ్గిన సమయంలో ప్రభుత్వం కనీస మద్దతు ధరకు ఆయా పంటలను వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేయించింది. కరోనా సమయంలో అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో వనామీ రొయ్యల ధర కేజీ రూ.50కు పడిపోయిన సమయంలో కూడా కనీస మద్దతు ధరలు ప్రకటించి ఎగుమతిదారుల ద్వారా కొనుగోలు చేయించింది. కానీ ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయడం అటుంచి రైతులు నష్టపోతుంటే సమీక్షలు జరిపిన సందర్భాలు కూడా లేకుండా పోయాయి.


