అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
● కారు, రెండు బైక్‌లు, రూ.3 లక్షల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం
● డీఎస్పీ దేవకుమార్ వెల్లడి
నల్లజర్ల : పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 26 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కారు, రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ శనివారం నల్లజర్ల పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ముఠా తూర్పుగోదావరి జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడినట్టు చెప్పారు. ఒడిశాలో పోలీసులపై ఈ ముఠా కాల్పులకు తెగపడినట్టు వివరించారు. నల్లజర్ల సెంటర్‌లో నక్కా వారివీధిలో ఒంటరిగా ఉంటున్న పాకలపాటి సుభద్ర ఇంట్లోకి చొరబడ్డ ఈ ముఠా సెప్టెంబరు 24వ తేదీ అర్ధరాత్రి రాళ్ళతో దాడి చేసి బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. అక్కడే ఉన్న రెండు బైక్‌లు తీసుకుపోయారు. దీనిపై నల్లజర్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అంతకుముందు రోజు ప్రత్తిపాడులో జ్యూయలరీ షాపులో 11కిలోల వెండి ,ఒక బుల్లెట్ బండి దొంగతనం చేశారు. దేవరపల్లి సీఐ నాగేశ్వర నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. నెల్లూరుకు చెందిన ప్రక్రద్దీన్ ఒంగోలు జైలులో ఉండగా ఈ మధ్యప్రదేశ్ ముఠాతో సంబంధాలు ఏర్పరుచుకొని నేరాలకు పాల్పడేవాడు. ఈ ముఠాతోనే నల్లజర్లలో నేరానికి పాల్పడినట్టు డీఎస్పీ వివరించారు. రెండునెలల తర్వాత ఈ ముఠాతో మళ్ళీ దొంగతనాలకు పాల్పడే క్రమంలో నల్లజర్ల పోలవరం కాలువగట్టు సమీపంలో శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈముఠాను నల్లజర్ల సీఐ వై.రాంబాబు తమ సిబ్బందితో వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా నల్లజర్లలో దొంగతనం చేసేంది తామే నని ఈ ముఠా ఒప్పుకుంది. నెల్లూరు రూరల్ మండలం మూలపేటకు చెందిన షేక్ ప్రక్రుద్దీన్, మధ్యప్రదేశ్ ధార్ జిల్లా వివిధ తండాలకు చెందిన హోలీబేడాకు చెందిన కేసు ఉమ్రా, మాల్పురియాకు చెందిన రాగన్ మాధవ్ హటిలా, దేవిపురాకు చెందిన బారిక్ సింగ్ అజినార్, హెలీబెడాకు చెందిన మొహర్‌కల్లు మోహదా, భుటియాకు చెందిన హీరు హరియా అజినార్‌లను అరెస్ట్ చేశామన్నారు. వీరిని తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపర్చగా 15 రోజులు రిమాండ్ విధించినట్టు చెప్పారు. సమావేశంలో దేవరపల్లి, నల్లజర్ల సిఐలు నాగేశ్వరనాయక్, వై.రాంబాబు, ఎస్‌ఐ దుర్గాప్రసాదరావు, క్రైం ఎస్‌ఐ రవీంద్ర పాల్గొన్నారు.


