పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి
● అనారోగ్యంతో చదువులు ముందుకు సాగవు
● ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు
అమలాపురం టౌన్: విద్యార్ధులు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, చేతి గోళ్లు, అరిచేతులు, జట్టు, తినే ఆహారం అన్నింటా పరిశుభ్రతను పాటిస్తే ఆరోగ్యం సిద్ధిస్తుందని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు హితవు పలికారు. అమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 150వ వార్షికోత్సవం, పూర్వపు విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా పాఠశాల వద్ద శనివారం జరిగిన ప్రవచన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అనారోగ్యంతో చదువులు ముందుకు సాగవన్నారు. విద్యార్ధులు ఇంట్లో అమ్మ పెట్టే ఆహారం తినేందుకే ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అమ్మ పెట్టే అన్నం అమృతంతో సమానమని పేర్కొన్నారు. చదువులకు ఎంత విలువ ఇస్తారో వ్యక్తిగత పరిశుభ్రతకూ అంతే విలువ ఇవ్వాలన్నారు. మార్కెట్‌లో దొరికే తాజా కాయగూరలతోపాటు మన ఇంటి పెరటిలోనో, ఆవరణలోనో మొక్కలు పెంచాలని సూచించారు. విద్యార్థులు చదువులతోపాటు క్రీడలకు ప్రాము ఖ్యత ఇవ్వాలని తెలిపారు. ఏకాగ్రతతో చదివినప్పుడే చదివింది వంట పడుతుందని తెలిపారు. పూర్వ విద్యార్థి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావుతోపాటు పూర్వ విద్యార్థులు బోణం కనకయ్య, నల్లా విష్ణుమూర్తి పాల్గొన్నారు. చాగంటిని పాఠశాల తరఫున సత్కరించారు.


