బాలుడి నిజాయితీ
గండేపల్లి: పదేళ్ల బాలుడికి తాను వెళుతున్న మార్గంలో నగదు ఉన్న పర్సు కంట బడటంతో భద్రపరిచి బాధితులకు అందజేసి తన నిజాయితీని చాటాడు. రంగంపేట మండలం వెంకటాపురానికి చెందిన బొడెం దొరబాబు తల్లి అనంతలక్ష్మితో కలసి మోటార్ సైకిల్‌పై గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో పెళ్లి భోజనానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో తాళ్లూరు యల్లమిల్లి మీదుగా తమ గ్రామం వెళుతుండగా తాళ్లూరు శివారులో అనంతలక్ష్మి పర్సు (రూ.7,200) పడిపోయింది. కొంతదూరం వెళ్లాక పర్సు పోయిందని గమనించి, వెనక్కి వెతుక్కుంటూ వచ్చినప్పటికి కనబడకపోవడంతో నిరుత్సామంతో ఇంటికి వెళ్లిపోయారు. తాళ్లూరు మఠంలో అన్న సమారాధనకు స్నేహితులతో వెళుతున్న గ్రామానికి చెందిన కిలాడి పండుకు పర్సు కనిపించింది దానిని భద్ర పరచి మఠంలో ఉన్న తన తండ్రి శ్రీనుకు తెలియజేశాడు. గ్రామానికి చెందిన కూరగాయల విక్రయదారుడు కురందాసు అప్పారావు, శ్రీను కలిసి గ్రామానికి చెందిన ఒమ్మి ప్రసాద్‌కు తెలియజేయడంతో పర్సులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా ప్రసాద్ బాధితులకు సమాచారం అందజేశారు. దీంతో బాధితులు వచ్చి నగదుతో ఉన్న పర్సును తీసుకున్నారు. ఈ సందర్భంగా బాలుడిని పలువురు అభినందించారు. బాలుడు స్థానికంగా ఉన్న హైస్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు.


