అంతా పదిలమేనా!
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్థానిక జగన్నాథపురానికి చెందిన శ్రీనివాస్ ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి పూర్తి చేశాడు. పరీక్షల సమయంలో నామినల్ రోల్స్ పంపించేటప్పుడు అతడి తండ్రి పేరు తప్పుగా నమోదు చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత అనంతరం అధికారులు జారీ చేసిన మార్కుల మెమోను శ్రీనివాస్ పరిశీలించగా తండ్రి పేరు తప్పుగా ఉన్నట్లు గుర్తించాడు. సరే ఏమవుతుందని అనుకుని ఇంటర్మీడియెట్ అడ్మిషన్ పొందాడు. టెన్త్ మార్కుల జాబితా ఆధారంగా అక్కడ కూడా తండ్రి పేరు తప్పుగా నమోదైంది. ఉన్నత విద్య పూర్తయ్యాక విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విద్యార్థి తండ్రి పేరు తప్పుగా ఉందని గుర్తించిన పాస్‌పోర్టు అధికారులు అతడి దరఖాస్తును తిరస్కరించారు. ఆ తర్వాత చదివుకున్న పాఠశాలకు వచ్చి, తండ్రి పేరును సరి చేయించుకునేందుకు శ్రీనివాస్‌కు ఏడాదికి పైగా సమయం పట్టింది. ఇది ఒక్క శ్రీనివాస్ నమస్యే కాదు. జిల్లాలో చాలా మంది విద్యార్థులకు ఏటా ఇలాంటి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. సాధారణంగా అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల వివరాల నమోదులో ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు పొరపాట్లు చేస్తూంటారు. భవిష్యత్తులో ఆ విద్యార్థులు ఉద్యోగాలు పొందేందుకు, విదేశాలకు వెళ్లేందుకు, పోటీ పరీక్షలు రాసే సమయంలోను టెన్త్ మార్కుల జాబితాలోని చిన్నచిన్న తప్పులే పెద్ద సమస్యగా మారుతూంటాయి. వాటిని సరిదిద్దుకునేందుకు తిరిగి నానా తంటాలూ పడాల్సి వస్తోంది. అధికారులకు సైతం ఈ సమస్య తలనొప్పిగా మారుతోంది. తల్లిదండ్రులు అవగాహన పెంచుకుని, టెన్త్ నామినల్ రోల్స్ సమయంలోనే అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో ఒకటికి రెండుసార్లు సరి చూసుకుంటే విద్యార్థుల భవిష్యత్తుకు ఎటువంటి సమస్యా తలెత్తదు.
ముందస్తు కార్యాచరణ
విద్యార్థి భవిష్యత్తుకు పదో తరగతి మార్కుల మెమోయే ఎంతో కీలకం. ఉన్నత చదువులే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సైతం అందులోని వివరాలే ప్రధానం. ఇంతటి ప్రాధాన్యమున్న మార్కుల జాబితాలు రూపొందించేటప్పుడు విద్యార్థుల వివరాల్లో ఎలాంటి తప్పులూ దొర్లకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు విద్యా శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల నామినల్ రోల్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటి పదిసార్లు పరిశీలించాలని, తేడాలుంటే సరి చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. విద్యార్థులు టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించక ముందే వారి వివరాలు సరిచూసేలా ముందస్తు కార్యాచరణ చేపట్టారు.
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 247, ప్రైవేటువి 219 ఉన్నాయి. ఈ 466 పాఠశాలల నుంచి ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 29,866 మంది హాజరవుతున్నారు. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 25వ తేదీ వరకూ గడువు ఉంది. ఈ తరుణంలో జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ఉపాధ్యాయులు, సిబ్బంది పదో తరగతి విద్యార్థుల పేర్లు, ఇంటి పేరు, తల్లిదండ్రుల పేర్లు, జన్మదినం తదితర వివరాలను సరిచూసే పనిలో నిమగ్నమయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా వివరాలు సేకరించి, యూడైస్‌లోని వివరాల ఆధారంగా పరిశీలిస్తున్నారు. అక్షర దోషాలు, వివరాల్లో తప్పులుంటే సరి చేస్తున్నారు. ఈ కసరత్తును వేగంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
సక్రమంగా నమోదు చేయాలి
అన్ని ప్రభుత్వ, పైవేటు పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థుల వివరాలు సక్రమంగా నమోదు చేయాలి. విద్యార్థి పేరుతో పాటు సంరక్షకుల పేర్లలో అక్షర దోషం లేకుండా చూడాలి. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు కూడా జాగ్రత్త వహించాలి.
– పిల్లి రమేష్, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ
విద్యార్థి భవితకు టెన్త్ మార్కుల
జాబితాయే కీలకం
ఏ తప్పు దొర్లినా తలనొప్పి తప్పదు
పకడ్బందీగా నామినల్ రోల్స్‌పై కసరత్తు
పబ్లిక్ పరీక్షలకు
29,866 మంది హాజరు
అంతా పదిలమేనా!


