భీమేశ్వరునికి జటాజూటాలంకరణ
పంచారామ క్షేత్రంలో ముగిసిన కార్తిక మాస ఉత్సవాలు
సామర్లకోట: పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత కుమారారామ భీమేశ్వరస్వామి వారికి శుక్రవారం వెండి జటాజూటాన్ని అలంకరించారు. కార్తిక మాసం ముగిసిన అనంతరం పోలి పాడ్యమి నాడు స్వామివారికి ఈ అలంకరణ చేయడం ఆనవాయితీ. బ్యాంకు లాకరులో భద్రపర్చిన వెండి జటాజుటాన్ని ట్రస్టు బోర్డు చైర్మన్, భక్త సంఘం నాయకులు ఆలయానికి తీసుకుని వచ్చారు. సంప్రోక్షణ అనంతరం దీనిని స్వామివారికి వేద పండితులు అలంకరించారు. భక్త సంఘం నాయకుల ఆధ్వర్యాన స్వామి, అమ్మవారి ఆలయాల్లో సాంబ్రాణి ధూపం వేశారు. సాయంత్రం 4 గంటలకు స్వామివారి జటాజూటాలంకరణను ఉచితంగా తిలకించడానికి భక్తులను అనుమతించారు. స్వామివారికి ధూపం వేయడంతో గంట వరకూ అలంకరణ కనిపించలేదు. బాలాత్రిపుర సుందరీదేవి అమ్మవారిని బంగారు కిరీటం, స్వర్ణాభరణాలతో అలంకరించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు బారులు తీరారు. భక్త సంఘం ఆధ్వర్యంలో ప్రసాద వితరణ చేశారు. ఆలయాన్ని పూలమాలలతో అందంగా అలంకరించారు. మహిళల కోలాటం, వీరభద్రుని నృత్యం తదితర సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
భీమేశ్వరునికి జటాజూటాలంకరణ


