ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హాల్‌ టిక్కెట్ల విడుదల | - | Sakshi
Sakshi News home page

ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హాల్‌ టిక్కెట్ల విడుదల

Nov 22 2025 7:10 AM | Updated on Nov 22 2025 7:10 AM

ఆరో త

ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హాల్‌ టిక్కెట్ల విడుదల

పెద్దాపురం (సామర్లకోట): నవోదయ విద్యాలయలో ఆరో తరగతి ప్రవేశ పరీక్షలకు హాల్‌ టిక్కెట్లు విడుదల చేశామని, ఇంటర్నెట్‌ సెంటర్ల ద్వారా వీటిని పొందాలని నవోదయ ప్రిన్సిపాల్‌ బి.సీతాలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షకు ఉమ్మడి జిల్లా నుంచి 7,170 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీరికి 32 కేంద్రాల ద్వారా రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి విద్యార్థి రిజిస్ట్రేషన్‌ నంబర్‌, యూజర్‌ ఐడీకి గాను విద్యార్థి పుట్టిన తేదీని పాస్‌వర్డ్‌గా ఉపయోగించుకోవాలని సూచించారు.

జర్మనీలో ఉద్యోగావకాశాలు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జర్మనీలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.గోపీకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్పెంటర్లు, స్టీల్‌ ఫిక్సర్లు, పేవింగ్‌ స్టోన్‌ వర్కర్లు, రోడ్డు వర్కర్ల వంటి వృత్తుల్లో అవకాశాలున్నాయని వివరించారు. పదో తరగతి ఉత్తీర్ణులై 44 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.2.57 లక్షల జీతం ఉంటుందన్నారు. వసతి, వీసా, విమాన చార్జీలను కంపెనీ భరిస్తుందన్నారు. అభ్యర్థులు ప్రాసెసింగ్‌ ఫీజు రూ.2 లక్షలు రెండు విడతల్లో చెల్లించాలన్నారు. వివరాలకు 99888 53335 నంబరులో సంప్రదించాలని కోరారు.

చేనేత పరిశ్రమను

ప్రభుత్వం ఆదుకోవాలి

కాకినాడలో రేపు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

పెద్దాపురం (సామర్లకోట): తీవ్ర సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆప్కో మాజీ డైరెక్టర్‌, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు ముప్పన వీర్రాజు డిమాండ్‌ చేశారు. పెద్దాపురంలోని ఆప్కో కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు కాకినాడలో ఆదివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. చేనేత పరిశ్రమకు రావలసిన 30 శాతం రిబేట్‌, పావలా వడ్డీ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి 30 శాతం రిబేట్‌ వస్తే నాణ్యమైన వస్త్రాలను ప్రజలకు తక్కువ ధరకే విక్రయించే వీలుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 వరకూ చేనేత సంఘాలున్నాయని, వీటిలో పని చేసిన కార్మికులు కూలీ సక్రమంగా అందే అవకాశం లేక ఇతర రంగాలకు మళ్లిపోతున్నారని చెప్పారు. ఈ సదస్సులో ప్రతి చేనేత కార్మికుడూ పాల్గొనాలని వీర్రాజు కోరారు.

నేటి నుంచి అంతర్‌

జిల్లాల ఖోఖో పోటీలు

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): పాఠశాల క్రీడా సమాఖ్య అండర్‌–14, 17 ఆధ్వర్యాన రాష్ట్ర స్థాయి అంతర్‌ జిల్లాల ఎస్‌జీఎఫ్‌ఐ ఖోఖో పోటీలు శనివారం ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24వ తేదీ వరకూ జరిగే ఈ పోటీలకు రాష్ట్రవ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల నుంచి 180 మంది క్రీడాకారులు, 30 మంది కోచ్‌లు, మేనేజర్లు, 40 మంది లోకల్‌ అధికారులు హాజరు కానున్నారు. పోటీల నిర్వహణకు డీఎస్‌ఏ మైదానంలో రెండు కోర్టులను సిద్ధం చేశారు. క్రీడాకారులకు గొడారిగుంట, రమణయ్యపేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్కూళ్లలో వసతి కల్పించారు. పోటీల ఏర్పాట్లను డీఈఓ పిల్లి రమేష్‌, ఎస్‌జీఎఫ్‌ఐ కార్యదర్శులు సుధారాణి, శ్రీను శుక్రవారం పర్యవేక్షించారు.

12 మంది పిల్లల్లో

గుండె వ్యాధుల నిర్ధారణ

కాకినాడ క్రైం: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా విజయవాడకు చెందిన ఇండో బ్రిటిష్‌ హాస్పిటల్‌ సౌజన్యంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన 18 ఏళ్లలోపు పిల్లలకు శుక్రవారం గుండె వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాకినాడ జీజీహెచ్‌లోని పీడియాట్రిక్స్‌ విభాగం పర్యవేక్షణలో సేవలందిస్తున్న డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్వెన్షన్‌ కేంద్రం(డైస్‌)లో డాక్టర్‌ జ్యోతిప్రకాష్‌ బృందం ఈ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించింది. 37 మంది పిల్లలను పరీక్షించగా, వీరిలో 12 మందిలో గుండె వ్యాధులు నిర్ధారించినట్లు డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్‌ తెలిపారు. వీరిలో ఐదుగురికి శస్త్రచికిత్సల ద్వారా, మిగిలిన ఏడుగురికి మందుల ద్వారా సమస్య నయం చేస్తారన్నారు. శస్త్రచికిత్సల నుంచి మందుల వరకూ పూర్తి ఉచితంగా అందిస్తున్నట్లు ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ వి.అరుణ తెలిపారు. స్క్రీనింగ్‌ పరీక్షలను పీడియాట్రిక్స్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ మాణిక్యాంబ పర్యవేక్షించారు.

ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హాల్‌ టిక్కెట్ల విడుదల 1
1/1

ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు హాల్‌ టిక్కెట్ల విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement