1 అయితే సరే.. ఆపైన ఇక్కట్లే.. | - | Sakshi
Sakshi News home page

1 అయితే సరే.. ఆపైన ఇక్కట్లే..

Nov 22 2025 7:10 AM | Updated on Nov 22 2025 7:10 AM

1 అయి

1 అయితే సరే.. ఆపైన ఇక్కట్లే..

ఇంటి నంబర్‌ 1తో ఉంటేనే రిజిస్ట్రేషన్లు

2 ఆపైన ఉంటే మొరాయింపు

రెండు నెలలుగా ఇదే తంతు

16 గ్రామాల కక్షిదారులకు ఇబ్బందులు

ప్రత్తిపాడు: పని సులభతరం చేయాడానికి ఉద్దేశించిన సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన లోపం వారికి శాపంగా మారింది. ఈ సమస్యతో ప్రత్తిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలోని 16 గ్రామాల్లోని స్థలాలకు రిజిస్ట్రేషన్లు జరగక కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నంబర్లు 1తో ఉంటేనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2, 3, 4.. ఆపైన ఉంటే రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. కుమార్తెకు పెళ్లి చేసి, పసుపు – కుంకుమ కింద ఇల్లు ఇద్దామన్నా.. ఇంటి స్థలాన్ని గిఫ్ట్‌గా రిజిస్ట్రేషన్‌ చేద్దామన్నా.. అవసరానికి అమ్ముకుందామన్నా.. కొనుగోలు చేద్దామన్నా.. డబ్బు అవసరం కోసం తనఖా పెట్టుకుందామన్నా రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఈ రోజు కాకపోతే మరో రోజు జరుగుతుందని కక్షిదారులు భావిస్తున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది కూడా ఏం చేయాలో తెలియక రేపు మాపు అంటూ తిప్పి పంపుతున్నారు.

ప్రత్తిపాడు, కిర్లంపూడి, శంఖవరం, గొల్లప్రోలు, పిఠాపురం, అడ్డతీగల తదితర మండలాల పరిధిలో 68 గ్రామాలకు సంబంధించిన ఆస్తుల క్రయవిక్రయాలు ప్రత్తిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే జరుగుతూంటాయి. అయితే, ప్రత్తిపాడు మండలం వాకపల్లి, పోతులూరు, ఒమ్మంగి, రాచపల్లి; ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి; గొల్లప్రోలు మండలం చెందుర్తి, చిన జగ్గంపేట, కొడవలి, వన్నెపూడి; కిర్లంపూడి మండలం వేలంక, రామకృష్ణాపురం, రాజుపాలెం, గెద్దనాపల్లి, ముక్కొల్లు; పిఠాపురం మండలం దొంతమూరు, వెల్దుర్తి గ్రామాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మాత్రం ఒకటో నంబర్‌ కాకపోతే జరగడం లేదు. ఈ గ్రామాల్లోని ఇంటి నంబర్లు 2, 3, 4, 5 తదితర నంబర్లతో ఉన్న నివేశన స్థలాలు, ఇళ్ల క్రయవిక్రయాలు, తనఖా, గిఫ్టు తదితర రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. అమ్మేవారు, కొనుగోలు చేసేవారు, వీలునామా రాసేవారు, రాయించుకునే వారు ప్రత్తిపాడు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి రోజూ సుదూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వస్తూంటారు. తీరా వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో నిరాశగా తిరిగి వెళ్తున్నారు. దూరాభారం, సమయం వృథా, సొమ్ముల ఖర్చు తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరి చేసి, తమ ఆస్తులకు రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరిగేలా చూడాలని ఆయా గ్రామాల కక్షిదారులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులకు

నివేదించాం

రిజిస్టేషన్ల శాఖలో సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తున్నందు వలన ఈ పరిస్థితి తలెత్తింది. కార్యాలయం పరిధిలోని అన్ని గ్రామాలకూ రిజిస్ట్రేషన్లు సక్రమంగా జరుగుతున్నాయి. ఈ 16 గ్రామాల్లో ఇంటి నంబర్‌ 1తో ఉంటే రిజిస్ట్రేషన్‌లో ఇబ్బందులు లేవు. 2 అంతకంటే ఎక్కువ నంబరు ఉన్న ఇళ్లు, నివేశన స్థలాల రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. ఈ సమస్యను ఉన్నతాధికారులను నివేదించాం.

– వి.విక్టర్‌ డేనియల్‌, సబ్‌ రిజిస్ట్రార్‌, ప్రత్తిపాడు

1 అయితే సరే.. ఆపైన ఇక్కట్లే..1
1/1

1 అయితే సరే.. ఆపైన ఇక్కట్లే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement