రబీలో 1.91 లక్షల ఎకరాలకు నీరు
బోట్‌క్లబ్ (కాకినాడి సిటీ): వచ్చే రబీలో జిల్లాలోని గోదావరి తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ), ఏలేరు పరిధిలోని 1,90,865 ఎకరాల పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. గోదావరి, ఏలేరు ఇరిగేషన్ వ్యవస్థల్లో ప్రస్తుత నీటి నిల్వల గురించి ఇరిగేషన్ ఎస్‌ఈ కె.గోపీనాథ్ తొలుత వివరించారు. ఈ వ్యవస్థల కింద రబీలో పూర్తి ఆయకట్టుకు అందించేందుకు నీటి నిల్వలున్నాయని చెప్పారు. కలెక్టర్ మాట్లాడుతూ, గోదావరి డెల్టా కింద 1,05,341 ఎకరాలు, పీబీసీ కింద 32,507 ఎకరాలు, ఏలేరు కింద 53,017 ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తామని తెలిపారు. వచ్చే నెల 1 నుంచి ప్రారంభమయ్యే రబీ సీజన్‌కు సంబంధించి ఆయకట్టు రైతులు డిసెంబర్ 31 నాటికి నాట్లు వేయాలని, వచ్చే ఏడాది మార్చి 31 లోగా సాగు పూర్తి చేయాలని కోరారు. రబీ సాగునీటి విడుదల చేసేలోగా జిల్లాలో సాగునీటి వ్యవస్థల పటిష్టతకు ప్రతిపాదించిన పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మోంథా తుపానుకు దెబ్బతిన్న కాలువలకు మరమ్మతులు చేపట్టాలన్నారు. జిల్లాలో 50 మైనర్ ఇరిగేషన్ చెరువులను ఆర్‌ఆర్‌ఆర్ (రిపేర్, రెన్నోవేషన్, రిస్టోరేషన్) స్కీమ్ కింద గుర్తించి, నిధుల మంజూరుకు ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. మరో 100 మైనర్ ఇరిగేషన్ చెరువులను కూడా గుర్తించామని, వీటికి కూడా త్వరలో ప్రతిపాదనలు పంపిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపారావు, ఎంపీలు, ఎమ్మెల్యే పాల్గొన్నారు.


