మంత్రిగారూ.. తీరు మార్చుకోవాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కార్తిక వనభోజనాల్లో శెట్టిబలిజి కులాన్ని విమర్శించేలా మాట్లాడడం సరికాదని, మంత్రి హోదాలో ఉన్నపుడు మాట తీరు మార్చుకోవాలని ఆ సంఘ నాయకులు హితవు పలికారు. అమలాపురంలో ఇటీవల జరిగిన శెట్టిబలిజ వనసమారాధనలో మంత్రి ఇష్టానుసారంగా మాట్లాడడంపై కాకినాడలోని జిల్లా శెట్టిబలిజి కమ్యూనిటీ హాల్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ వైస్ ఎంపీపీ కర్రి గోపాలకృష్ణ, జెడ్పీటీసీ వీరవల్లి శ్రీనివాస్, శెట్టిబలిజ సంఘ నాయకులు రాయుడు నాగేశ్వరరావు, అనుసూరి ప్రభాకర్ తదితరులు మాట్లాడుతూ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను మంత్రి సుభాష్ విమర్శించడం సరికాదన్నారు. ఏ పార్టీ అయినా శెట్టిబలిజి ఐక్యతను చూసి రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రి పదవులు ఇస్తున్నారన్నారు. నాయకుల తీరు వల్ల లా వర్గం ఐక్యత దెబ్బతింటుందన్నారు. కుల అభివృద్ధిని పక్కనపెట్టి సొంత అజెండాతో నిర్ణయాలు తీసుకుని ఒకరిని ఒకరు దూషించుకోవడం సరికాదన్నారు. పదవులు వీరికి సొంతంగా రాలేదని, కేవలం కులం ఆధారంగా వచ్చాయన్న సంగతి మర్చిపోకూడదన్నారు. సమాజంలో ఎదుగుతున్న శెట్టిబలిజ కులాన్ని ప్రస్తుత తరం ఆదర్శంగా తీసుకోవాలని ఆ విధంగా నాయకులు ప్రవర్తించాలన్నారు. రాజకీయంగా ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని వారు సూచించారు. సమావేశంలో శెట్టిబలిజ సంఘ నాయకులు గుబ్బల వెంకటేశ్వరరావు, రాయుడు వెంకటేశ్వరరావు, కేత శ్రీనివాస్, సత్తిబాబు, సత్తిబాబు, కడలి రాంపండు, వాసంశెట్టి మాధవ్, పిల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సుభాష్‌కు శెట్టిబలిజ
సంఘం నాయకుల హితవు


