సాహస పథం.. సేవా దృక్పథం
● విద్యార్థుల్లో పెరుగుతున్న ఆసక్తి
● సుశిక్షితులవుతున్న వైనం
● రేపు 77వ ఎన్‌సీసీ దినోత్సవం
రాయవరం: వారు ఎంతటి సాహసకృత్యానికై నా వెనుకాడరు. ఎలాంటి విపత్కర పరిస్థితులలోను మనోధైర్యాన్ని కోల్పోరు. ఎదపై బండరాళ్లను పగులకొట్టించుకోవడం, భగభగమండే రింగుల్లో నుంచి క్షణాల్లో దూరి పోవడం, వాతావరణం ఏ మాత్రం అనుకూలంగా లేని అరణ్యాల్లో పర్యటించడం, పర్వతారోహణ చేయడం, సముద్రాల్లో సెయిలింగ్ వంటి పనులు వారి మనోధైర్యానికి మచ్చుతునకలు. జాతరలు, ఉత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ట్రాఫిక్ నియంత్రణలో తమ సహకారం అందించడం వారి సేవా దృక్పథానికి నిదర్శనం. వారే ఎన్‌సీసీ విద్యార్థులు. శనివారం 77వ ఎన్‌సీసీ దినోత్సవం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో ఎన్‌సీసీ అమలు తీరుతెన్నులపై ప్రత్యేక కథనం.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
ఉక్కు సంకల్పం, ధైర్య సాహసాలు..విలువలకు మారు పేరుగా ఎన్‌సీసీ (నేషనల్ క్యాడెట్ కార్‌ప్స్) నిలుస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 25 కళాశాలలు, 52 పాఠశాలల్లో ఎన్‌సీసీ అమలవుతోంది. ఇందులో ఎన్‌సీసీ క్యాడెట్లుగా సుమారు 36,000 మంది బాల బాలికలు శిక్షణ పొందుతున్నారు.
ఎవరు అర్హులంటే..
ఎనిమిదో, తొమ్మిదో తరగతిలో కనీసం ఐదు అడుగుల ఎత్తు ఉండి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారిని మాత్రమే ఎన్‌సీసీ క్యాడెట్స్‌గా ఎంపిక చేస్తారు. ఎన్‌సీసీ అమలవుతున్న విద్యాసంస్థల్లో బోధకుడిని ఎన్‌సీసీ అధికారిగా నియమిస్తారు. ఆ అధికారి ఆధ్వర్యంలోనే శిక్షణ ఉంటుంది.
సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే ధ్యేయం
విద్యార్థుల్లో సంపూర్ణ వ్యక్తిత్వ వికాసమే ధ్యేయంగా ఎన్‌సీసీ శిక్షణ కొనసాగుతుంది. దశలవారీగా శిక్షణ ఉంటుంది. ప్రతి ఆదివారం, సెలవు రోజుల్లో క్యాడెట్లకు ఫీల్డ్ క్రాఫ్ట్, బెటల్ క్రాఫ్ట్, డ్రిల్లింగ్, ఫైరింగ్, మిలటరీ మ్యాప్ రీడింగ్, ఆప్టికల్స్ కోర్సులో శిక్షణ ఇస్తారు. క్రమశిక్షణ, ధైర్య సాహసాల పెంపు, సేవాభావం, దేశభక్తి, మానవీయ విలువలు తదితర పలు అంశాలను కూడా బోధిస్తారు. శిక్షణలో క్యాడెట్ల క్రమశిక్షణ, హాజరు, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి పలు అంశాలను పరిగణలోనికి తీసుకుని ఏడాదిలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే 15 క్యాంపులకు ఎంపిక చేస్తారు. మిలటరీ అధికారుల పర్యవేక్షణలో క్యాడెట్లకు ఫైరింగ్, పర్వతారోహణ, జంపింగ్, విపత్కర పరిస్థితిని ఎదుర్కొనే మానసిక, శారీరక స్థైర్యాన్ని పెంపొందించే పలు సాహస కృత్యాల్లో కఠోర శిక్షణ ఇస్తారు. క్యాంపుల్లో శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న క్యాడెట్లు సంపూర్ణ వ్యక్తులుగా ఎదుగుతారు.
కాకినాడ హెడ్ క్వార్టర్స్‌గా..
ఎన్‌సీసీ గ్రూపు కాకినాడ హెడ్ క్వార్టర్స్‌గా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గ్రూపు కమాండర్‌గా కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ కొనసాగుతున్నారు. కాకినాడ కేంద్రంగా ఇటీవల కాలంలో ఆయన నేతృత్వంలో వివిధ రకాల క్యాంపులు నిర్వహించారు. రాష్ట్ర, జాతీయ స్థాయి క్యాంపులు ముఖ్యంగా ఈ ఏడాది స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్, మెను క్యాంప్‌లు నిర్వహించారు. ఐడియా, ఇన్నోవేషన్ కాంపిటేషన్స్ కూడా నిర్వహించారు. ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్‌సీసీ క్యాడెట్స్‌తో నిర్వహించిన కార్యక్రమాలు కాకినాడ హెడ్ క్వార్టర్స్‌కు మంచి పేరు తీసుకువచ్చాయి.
విద్య, ఉద్యోగాల్లో
రిజర్వేషన్ సౌకర్యం
రెండేళ్లు శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు పాఠశాల స్థాయిలో ‘ఎ’ సర్టిఫికెట్, కళాశాల స్థాయిలో ‘బి’ సర్టిఫికెట్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీ స్థాయిలో ‘సి’ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. సర్టిఫికెట్ సాధించిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ‘సి’ సర్టిఫికెట్ సాధించిన క్యాడెట్లకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో నేరుగా ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో ఉన్న ఎస్సైలు, పోలీస్ కానిస్టేబుల్స్‌లో అత్యధికులు ఎన్‌సీసీ నేపథ్యం ఉన్న వారే.
దేశభక్తి, క్రమశిక్షణ పెరుగుతాయి
ఎన్‌సీసీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి పెరుగుతుంది. ఎన్‌సీసీలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. క్రమం తప్పకుండా క్యాంపులు నిర్వహిస్తూ ఏటా వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం.
– కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్, గ్రూపు కమాండర్, ఎన్‌సీసీ గ్రూపు
హెడ్ క్వార్టర్, కాకినాడ
సాహస పథం.. సేవా దృక్పథం
సాహస పథం.. సేవా దృక్పథం


