చోరీ కేసులో నిందితుడి అరెస్టు
నగదు, సెల్‌ఫోన్లు రికవరీ
పెద్దాపురం (సామర్లకోట): పట్టణ టెలికాం కాలనీలో ఇటీవల జరిగిన చోరీకి సంబంధించి నిఽందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి నగదు, రెండు సెల్‌ఫోన్లు, మోటారు సైకిలు, దొంగతనానికి ఉపయోగించిన ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపారు. గురువారం పెద్దాపురం సీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల పెంకే సింహచలం తన కుమార్తె వివాహం నిమిత్తం బీరువాలో ఉంచిన రూ.ఐదు లక్షల నగదు, బంగారం ముక్క టెలికాం కాలనీలో నివాసం ఉంటున్న ఇంటి బెడ్ రూమ్‌లో బీరువా లాకర్‌లో పెట్టినట్టు చెప్పారు. పెళ్లి పనుల కోసం కాకినాడ వెళ్లి ఈ నెల 10వ తేదీ రాత్రి 12.30 గంటల సమీపంలో ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపులు, బీరువా తెరచి ఉండటంతో ఈ నెల 11వ తేదీన పెంకే సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మౌనిక కేసు నమోదు చేశారన్నారు. ఘటనా ప్రదేశంలో లభించిన ఆధారాల మేరకు బుధవారం రాత్రి పెద్దాపురం–సామర్లకోట రోడ్డులోని అయోధ్యాలయం గ్రాండ్ లే అవుట్ వద్ద నిందితుడు యర్రంశెట్టి చరణ్ విఘ్నేష్‌ను అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న రూ.3.60 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, మోటారు సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు పెద్దాపురం మండలం, ఆనూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా చెప్పారు. ఇతనిపై గతంలో చైతన్యపురం, మలక్‌పేట, అంబర్‌పేట, సరూర్‌నగర్, రాజమహేంద్రవరం, వనస్థలిపురం, గండేపల్లి, ప్రకాశనగరం, సర్పవరం, హయాత్‌నగరం పోలీసు స్టేషన్లలో పలు దొంగతనం కేసులు ఉన్నాయని వివరించారు. నిందితుడిని చాకచక్యంగా అరెస్టు చేసిన సీఐ పి.విజయ్‌శంకర్, క్రైమ్ సీఐ అంకబాబు, ఎస్సై మౌనిక, సిబ్బందిని ఎస్పీ బిందుమాధవ్ అభినందించారని డీఎస్పీ తెలిపారు.


