చేతివాటంపై దర్యాప్తు చేయాలి
కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీల నగదు లెక్కింపులో సేవకుడి పేరుతో చేతివాటం ప్రదర్శించిన ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయం హుండీలను బుధవారం తెరచి లెక్కిస్తున్న సమయంలో రామచంద్రపురం మండలం వెంగాయమ్మపేటకు చెందిన వాసంశెట్టి శ్రీనివాసరావు అనే సేవకుడు రూ.60 వేల దొంగతనానికి పాల్పడగా, అతనిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జగ్గిరెడ్డి గురువారం కొత్తపేటలో విలేకరులతో మాట్లాడుతూ ప్రతీ శనివారం ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారని, క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆలయ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శ్రీనివాసరావు అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త రూ.60,000 దొంగిలించిన ఉదంతం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. గతంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ధర్మకర్తగా ఉన్న ఆ పార్టీ నాయకుడే డైరెక్ట్‌గా స్వామివారి హుండీలో చేతులు పెట్టి నగదు తీసుకువెళ్లిన దృశ్యాలు చూశామన్నారు. అలాగే దంపతులు నిలువు దోపిడీ మొక్కు తీర్చుకొని నగలు స్వామివారికి సమర్పిస్తే, లెక్కించే సమయంలో అవి లేకపోవడం చూసి వారు ఫిర్యాదు చేసిన ఘటన కూడా తెలుగుదేశం హయాంలో జరిగిందన్నారు. శ్రీనివాసరావు అనే వ్యక్తి ఒక బృందం ద్వారా సేవ చేసేందుకు ఆలయానికి వచ్చి ఇటువంటి దొంగతనాలకు పాల్పడ్డాన్ని వైఎస్సార్ సీపీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇతను ఎప్పటి నుంచి వస్తున్నాడు? ఎవరు చెబితే అతనికి ఈ అవకాశం కల్పించారు? అతను గతంలో ఏఏ దేవాలయాల్లో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నాడు? వంటి అంశాలు విచారించి మొత్తం ఎంత దొంతిలించాడో తేల్చాలన్నారు. అతను ఎవరు సిఫారసు చేస్తే ద్రాక్షారామ ఆలయంలో ఉత్సవ కమిటీ సభ్యుడిగా ఉన్నాడో, తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దేవాలయాలను కూడా తెలుగు తమ్ముళ్లు ఈ విధంగా దోచుకుకుంటున్నారన్నారు.
మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి డిమాండ్


