రిటైర్డ్ ఎంఈవోకు సైబర్ వల
ముమ్మిడివరం: రిటైర్డ్ ఎంఈవో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కారు. ఏకంగా రూ.34.60 లక్షలు పోగొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ముమ్మిడివరం ఎస్‌ఐ జ్వాలా సాగర్ గురువారం తెలిపారు. ముమ్మిడివరం, కాట్రేనికోనతోపాటు పలు మండలాల్లో ఎంఈవోగా పనిచేసిన బొజ్జా రమణశ్రీ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నారు. మీ ఆధార్‌కార్డు ద్వారా రూ.3 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయని, దీనిపై కేసు నమోదయ్యిందని సైబర్ నేరగాళ్లు ఆయనను ఫోన్‌లో బెదిరించారు. ఇది చాలా పెద్ద కేసు అని, కేసు మాఫీకి రూ.70 లక్షలు ఇవ్వాలని ఆగంతకులు వాట్సాప్ కాల్‌లో బెదిరించారు. దీంతో భయపడిన ఆయన విడతల వారీగా రూ.34.60 లక్షలు వారికి ముట్టజెప్పారు. నేరగాళ్ల తీరుతో అనుమానం వచ్చిన ఆయన మోసపోయానని గ్రహించారు. దీనిపై ఆయన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ జ్వాలాసాగర్ తెలిపారు.
● అక్రమ లావాదేవీల పేరుతో బెదిరింపు
● రూ.34.60 లక్షల చెల్లింపు


