రాష్ట్ర స్థాయి క్రీడలకు ముగ్గురు విద్యార్థులు
అల్లవరం: స్కూల్ గేమ్స్ జిల్లా స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 18న కాకినాడలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ క్రీడాప్రదర్శన చేసిన ముగ్గురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని దేవగుప్తం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్.వేణుగోపాలకృష్ణ గురువారం తెలిపారు. అండర్ –14 బాలురు, బాలికల వాలీబాల్ విభాగంలో తొమ్మిదో తరగతి చదువుతున్న గెద్దాడ సాయి ప్రసన్న, పెచ్చెట్టి పవన్‌కుమార్, అండర్ 17 షాట్ పుట్ బాలికల విభాగంలో గూడవిల్లి రక్షిత జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం తెలిపారు. ఈ నెల 24న గుంటూరులో జరిగే షాట్‌పుట్ పోటీల్లో రక్షిత, డిసెంబర్ 6 న నెల్లూరులో జరిగే వాలీబాల్ పోటీల్లో సాయిప్రసన్న, పవన్‌కుమార్ జిల్లా తరపున ఆడనున్నారని తెలిపారు. క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన చేయడంలో కృషి చేసిన పీడీ రాజ్‌కుమార్‌ను హెచ్‌ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.


