ఆధ్యాత్మిక సౌరభం.. భక్తజన సంరంభం
కార్తిక పౌర్ణమినాడు సత్యదేవుని
గిరి ప్రదక్షిణకు వెల్లువెత్తిన భక్తజనం (ఫైల్)
● సత్యదేవుని సన్నిధిలో
ముగిసిన కార్తిక సందడి
● ఈ నెల రోజుల్లో సుమారు
20 లక్షల మంది భక్తుల రాక
● 1,34,500 వ్రతాల నిర్వహణ
● రూ.23 కోట్ల ఆదాయం
వస్తుందని అంచనా
అన్నవరం: పుణ్యక్షేత్రమైన అన్నవరానికి మరింతగా ఆధ్యాత్మిక పరిమళాలను అద్దిన కార్తిక సందడికి గురువారంతో తెర పడింది. అటు దేవస్థానానికి ఇటు గ్రామంలో వివిధ వృత్తుల వారికి ఈ పవిత్ర మాసం సిరులు కురిపించింది. గతంలో తిరుపతి, సింహాచలంతో పాటు కార్తిక మాసంలోనే కాశీబుగ్గ ఆలయంలో జరిగిన దుర్ఘటనల్లో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, సత్యదేవుని సన్నిధికి లక్షలాదిగా భక్తజనం పోటెత్తినప్పటికీ.. ఎటువంటి అపశృతీ లేకుండా అంతా సాఫీగా సాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కార్తికంలో సుమారు 20 లక్షల మంది భక్తులు సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యధికంగా చివరి వారంలో భక్తులు వెల్లువలా తరలి వచ్చారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో శని, ఆది, సోమవారాలు కావడంతో సుమారు 3 లక్షల మంది భక్తులు రావడం విశేషం.
కార్తిక సంరంభమిలా..
● అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం వరకూ ఆశ్వయుజ అమావాస్య. ఆ తరువాత కార్తిక శుద్ధ పాడ్యమి ప్రారంభమైంది. అదే రోజున రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో ఆకాశ దీపం ఏర్పాటుతో కార్తిక మాసోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 22 ఉదయం నుంచే కార్తిక మాస సందడి నెలకొంది.
● కార్తికం ప్రారంభంలోనే మోంథా తుపాను ప్రభావంతో అక్టోబర్ 23 నుంచి 28వ తేదీ వరకూ భక్తులు పెద్దగా రాలేదు. ఆ తరువాత మూడు వారాల్లో మాత్రం లక్షలాదిగా భక్తులు తరలి రావడంతో రత్నగిరి జనసంద్రమే అయ్యింది. తుపాను అనంతరం మిగిలిన 24 రోజుల్లో దాదాపు 20 రోజుల పాటు భక్తులతో కిటకిటలాడింది. తొలి రోజు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మర్నాడు సాయంత్రం వరకూ వేలాదిగా వచ్చిన భక్తులతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కళకళలాడింది.
● కార్తిక మాసంలో శని, ఆది, సోమవారాలు, దశమి, ఏకాదశి, పౌర్ణమి వంటి పర్వదినాల్లో 80 వేల నుంచి లక్ష మందికి పైగా భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు.
● ఈ నెల 2న క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినం సందర్భంగా పంపా సరోవరంలో సత్యదేవుని తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది.
● ఐదో తేదీ కార్తిక పౌర్ణమి నాడు సత్యదేవుని సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం జరిగిన గిరి ప్రదక్షిణలో 2 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు.
● ఈ నెల 15న బహుళ ఏకాదశి కావడంతో అత్యధికంగా 1.20 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. అదే రోజు ఈ కార్తిక మాసంలోనే అత్యధికంగా 11,647 వ్రతాలు జరిగాయి.
వ్రతాలపై ‘మోంథా’ ప్రభావం
కార్తికంలో సత్యదేవుని వ్రతాలు 1,34,500 జరిగాయి. గత ఏడాది కార్తికంలో 1,47,142 జరగగా, దీనితో పోల్చితే ఈ ఏడాది 12,642 వ్రతాలు తగ్గాయి. కార్తికం తొలి వారంలో మోంథా తుపాను ప్రభావంతో ఆరు రోజుల పాటు భక్తులు అంతంత మాత్రంగానే రావడంతో ఆ మేరకు వ్రతాలు తగ్గాయని అధికారులు చెప్పారు. తుపాను రకపోతే ఈ ఏడాది రికార్డు స్థాయిలో 1.50 లక్షల వ్రతాలు జరిగేవని తెలిపారు. 2022లో 1,42,378 వ్రతాలు జరగగా.. 2023లో ఆ సంఖ్య మిచాంగ్ తుపాను ప్రభావంతో 1,28,832కు తగ్గింది.
దండిగా ఆదాయం
కార్తికంలో రూ.23 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది కార్తికంలో రూ.21.50 కోట్ల రాబడి వచ్చింది. వాస్తవానికి ఏటా కార్తికంలో సత్యదేవుని ఆదాయం పెరుగుతోంది. అయితే ఈ ఏడాది తుపాను కారణంగా ఒక వారం భక్తులు రాకపోవడంతో ఆ ప్రభావం ఏ మేరకు ఉంటుందోనని తర్జనభర్జనలు పడుతున్నారు. తొలి విడతగా ఈ నెల 7న హుండీల ద్వారా రూ.1.73 కోట్ల ఆదాయం వచ్చింది. వచ్చే నెలలో మరో విడత హుండీల ఆదాయం లెక్కించనున్నారు. దేవస్థానం బస్సుల ద్వారా కూడా దేవస్థానానికి రూ.38 లక్షల ఆదాయం వచ్చింది. గత ఏడాది కార్తికంలో ఇది రూ.42 లక్షలుగా ఉంది. ఈ ఆదాయానికి కూడా తుపాను గండి కొట్టింది.
కంపార్ట్‌మెంట్ విధానంతో సత్ఫలితాలు
లక్షలాదిగా వచ్చిన భక్తులను దృష్టిలో ఉంచుకుని దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పశ్చిమ రాజగోపురం ముందు భక్తులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన కంపార్ట్‌మెంట్లు సత్ఫలితాలనిచ్చాయి. ఆరు కంపార్ట్‌మెంట్లు ఏర్పాటు చేసి, ఒక్కో దానిలో వెయ్యి మంది చొప్పున భక్తులను ఉంచి, క్యూ ఖాళీ అయిన వెంటనే అందులోకి పంపించేవారు. దీనివలన తోపులాట లేకుండా దర్శనాలు సజావుగా జరిగాయి.
ముందస్తు ఏర్పాట్లతో..
కార్తిక మాసం ప్రారంభమైన తరువాత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ గత నెల 25న దేవస్థానంలో ఏర్పాట్లను పరిశీలించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వీర్ల సుబ్బారాావుతో సమీక్షించారు. గిరి ప్రదక్షిణకు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా దేవదాయ శాఖ రాజమహేంద్రవరం ఆర్‌జేసీ వి.త్రినాథరావును, సహాయకులుగా డిప్యూటీ కమిషనర్ రమేష్ బాబు, లోవ, వాడపల్లి ఈఓలు విశ్వనాథరాజు, చక్రధరరావులను నియమించి, అవసరమైన సూచనలు ఇచ్చారు. చైర్మన్ రోహిత్, ఈఓ సుబ్బారావు, ఇతర అధికారులు, సిబ్బంది కూడా సమన్వయంతో పని చేయడంతో కార్తికం సవ్యంగా ముగిసింది.
రికార్డు స్థాయిలో ప్రసాదాల అమ్మకాలు
ఈ ఏడాది ప్రసాదాల అమ్మకాలు కూడా రికార్డు స్థాయిలో జరిగాయి. ఒక్కొక్కటి రూ.20 చొప్పున సుమారు 23 లక్షల ప్రసాదం ప్యాకెట్లు విక్రయించారు. ప్రసాదం తయారీ, ప్యాకింగ్ సిబ్బంది అహర్నిశలూ కష్టపడి సాధారణ రోజుల్లో 70 వేల నుంచి లక్ష, పర్వదినాలలో లక్ష నుంచి 2 లక్షల వరకూ కూడా ప్రసాదం ప్యాకెట్లు తయారు చేశారు.
సిబ్బంది బాగా పని చేశారు
కార్తికంలో దేవస్థానం సిబ్బంది చాలా బాగా పని చేశారు. అర్ధరాత్రి ఒంటి గంట నుంచే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. అందువల్లనే ఎక్కడా చిన్నపాటి లోపం కూడా లేకుండా అంతా సాఫీగా సాగింది. లారెస్ విశ్రాంతి షెడ్డు, తాత్కాలిక కంపార్ట్‌మెంట్లు బాగా ఉపయోగపడ్డాయి.
– ఐవీ రోహిత్, చైర్మన్, అన్నవరం దేవస్థానం
అందరి సహకారంతో..
కార్తికంలో అన్నవరం వచ్చిన భక్తులకు ఏ లోటూ లేకుండా ఏర్పాట్లు చేశాం. సిబ్బంది బాగా కష్టపడ్డారు. పోలీసు, రెవెన్యూ, స్వచ్ఛంద సేవల సిబ్బంది, ఇతర విభాగాల వారు బాగా సహకరించారు.
– వీర్ల సుబ్బారావు, ఈఓ,
అన్నవరం దేవస్థానం
ఆధ్యాత్మిక సౌరభం.. భక్తజన సంరంభం
ఆధ్యాత్మిక సౌరభం.. భక్తజన సంరంభం


