ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గమ్మవారికి కార్తిక అమావాస్య సందర్భంగా గురువారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం 9 గంటలకు పండితులు ప్రత్యేక పూజలు చేసి, హోమం ప్రారంభించి, 11 గంటలకు పూర్ణాహు తి గావించారు. అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాదులు, ప్రసాదాలు నివేదించి, భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు యనమండ్ర శర్మ, అర్చకుడు ప్రయాగ రాంబాబు, పరిచారకులు వే ణు, బాలు, వ్రత పురోహితులు చెళ్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు దంపతులతో పాటు 40 మంది భక్తులు రూ.750 టిక్కెట్టుతో హోమంలో పాల్గొన్నారు.
ఈవీఎం గోదాము తనిఖీ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గురువారం పరిశీలించారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ల భద్రతకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేసి, అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు. వీటి భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలా గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదిక పంపిస్తున్నామని వెల్లడించారు. గోదాము చుట్టూ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలూ జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి.జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల విభాగం డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా సవరణకు
సహకరించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, కొత్త వాటి ఏర్పాటు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జె.వెంకట్రావు కోరారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్‌లో గురువారం ఈ అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,640 పోలింగ్ కేంద్రాల పరిధిలో ప్రస్తుతం 16,43,161 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్ల సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుని పునర్వ్యవస్థీకరణ, కొత్త పోలింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదిస్తామని చెప్పారు. పోలింగ్ నిర్వహణకు అనువుగా లేని కేంద్రాలను అనువైన మరో భవనంలోకి మార్చేందుకు ప్రతిపాదిస్తామన్నారు. హేతుబద్ధీకరణ ప్రకారం జిల్లాలో కొత్తగా 183 పోలింగ్ కేంద్రాలు రానున్నాయని తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ తమ బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకానికి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన బీఎల్‌ఏ–2 ఫామ్‌లో వివరాలు తప్పనిసరిగా తెలియజేయాలని డీఆర్‌ఓ కోరారు. సమావేశంలో రావూరి వేంకటేశ్వరావు (వైఎస్సార్ సీపీ), సీహెచ్ రమేష్‌బాబు (బీజేపీ) తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణకు చర్యలు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) జె.వెంకటరావు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్ల వద్ద విధులు నిర్వహించే కస్టోడియన్ అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వారి విధులు, రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) నుంచి వచ్చిన ధాన్యానికి తిరుగు రశీదు జారీ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో 269 రైతు సేవా కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. వీటిని 117 రైస్ మిల్లులకు అనుసంధానం చేశామని చెప్పారు. జిల్లాలో ధాన్యం సేకరణ ఇప్పటికే ప్రారంభమైందని, ఇప్పటి వరకూ 25 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలిపారు. మిల్లుల వద్ద కస్టోడియన్ అధికారులను రెండు షిఫ్టుల్లో నియమించామని చెప్పారు. వీరు మిల్లులకు వచ్చిన ధాన్యం వాహనాలను నిర్ణీత సమయంలో అన్‌లోడ్ చేయించి, రద్దీ లేకుండా చూడాలని డీఆర్‌ఓ ఆదేశించారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.దేవులా నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రత్యంగిర హోమం


