సాగర తీరాన ఆధ్యాత్మిక సందడి
● రసలింగేశ్వరునికి, 1.08 కోట్ల శివలింగాలకు వైభవంగా మహాకుంభాభిషేకం
● ఆదికుంభేశ్వరస్వామికి బిల్వార్చన
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు
కాకినాడ రూరల్: సాగర తీరాన ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కార్తిక అమావాస్యను పురస్కరించుకుని కుంభాభిషేకం రేవు వద్ద మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వర స్వామి ఆలయంలో గురువారం మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. వేకువజాము నుంచే పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తరలివచ్చారు. దుమ్ములపేట తదితర ప్రాంతాల వారు సముద్ర స్నానాలు చేసి స్వామి వారికి స్వయంగా అభిషేకాలు చేసుకున్నారు. ఉదయం ఆదికుంభేశ్వరస్వామికి బిల్వార్చన నిర్వహించారు. రసలింగేశ్వరస్వామికి తోట పుండరీకాక్షులు (బాబీ) దంపతుల ఆధ్వర్యాన మహాకుంభాభిషేకం నిర్వహించి ఆ ద్రవ్యాలను 108 మంది కన్యలతో సముద్రంలో నిమజ్జనం చేశారు. శ్రీదేవీ భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారికి శాంతి కల్యాణం నిర్వహించారు. 1.08 కోట్ల శివలింగాలకు సలాది శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యాన మహాకుంభాభిషేకం జరిపారు. రెండుచోట్లా భక్తులు కూడా స్వయంగా అభిషేకాలు చేసుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యాన విస్తృత ఏర్పాట్లు చేశారు. దుమ్ములపేట ప్రజలు, మత్స్యకారులు, బోట్ల యజమానులు, చేపల వ్యాపారులు, చేపల వేలం పాటదారుల సంయుక్త ఆధ్వర్యాన మధ్యాహ్నం భారీ అన్నదానం నిర్వహించారు. పోర్టు స్టేషన్, ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. లోక కల్యాణార్థం, ప్రకృతి విపత్తుల నుంచి దేశానికి ఉపశమనం కలిగించే సంకల్పంతో కాకినాడ సాగర తీరాన ఏటా ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని తోట పుండరీకాక్షులు (బాబీ) మీడియాతో అన్నారు. అభిషేక ద్రవ్యాలను 108 మంది కన్యలతో నిమజ్జనం చేయడం ద్వారా సముద్రం శాంతిస్తుందన్నారు. ఆలయం శిథిలావస్థకు చేరుకుంటోందని, దీనిని పరిరక్షించుకునే బాధ్యత కాకినాడ ప్రజలపై ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ డైరెక్టర్ తుమ్మల రామస్వామి తదితరులు పాల్గొన్నారు.


