భవిత నీదే బ్యాచిలర్‌! | - | Sakshi
Sakshi News home page

భవిత నీదే బ్యాచిలర్‌!

Nov 20 2025 6:40 AM | Updated on Nov 20 2025 6:40 AM

భవిత

భవిత నీదే బ్యాచిలర్‌!

రాయవరం: డిగ్రీ కోర్సుల కోసం మంచి కళాశాలలో చేరాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇంటర్‌లో మార్కుల పర్సంటేజీ బాగుండాలి. ఈ రెండు కాకుంటే ప్రజా ప్రతినిధులు, ప్రముఖులతో సిఫారసు చేయించాలి. ఇది ఒకప్పటి మాట. నేడు పరిస్థితి మారింది. డిగ్రీ వైపు మొగ్గు చూపే విద్యార్థుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. ఒకప్పుడు డిగ్రీ కళాశాలలకు మంచి ఫోకస్‌ ఉండేది. ఒక్కో కాలేజీలో సుమారు ఐదు వేల వరకు విద్యార్థులు చదువుకునేవారు. ఇప్పుడు ఆ సంఖ్య వందలకు పడిపోయింది. కొన్ని మూతపడేందుకు సిద్ధంగా వున్నాయి. డిగ్రీ అంటేనే విద్యార్థులు పెదవి విరిచే పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా ఈ ఏడాది డిగ్రీ కళాశాలల అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల చేయడంలో ఏర్పడ్డ జాప్యం తీవ్ర ప్రభావం చూపింది.

ఇంజినీరింగ్‌పై ఆసక్తి

ఇంజినీరింగ్‌ కోర్సుల హవా ముందు డిగ్రీ కోర్సులు డీలా పడ్డాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం నెమ్మదించినప్పటికీ 2024 నుంచి ఇంజిరింగ్‌ కోర్సుల వేగం మళ్లీ పెరిగింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా వాటిలో 1,960 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన కౌ న్సెలింగ్‌లో 772 మంది మాత్రమే అడ్మిషన్లు పొందా రు. ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరానికి సంబంధించి కేవలం 39 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇదిలా ఉంటే మొదటి సంవత్సరంలో స్పాట్‌ అడ్మిషన్లకు గడువు ఈ నెల 20తో ముగియనుంది. డిగ్రీ అడ్మిషన్లకు ఇదే చివరి అవకాశం కానుంది.

నోటిఫికేషన్‌ ఆలస్యంతోనే

నోటిఫికేషన్‌ ఆలస్యంగా వెలువడడమే డిగ్రీలో అడ్మిషన్ల సంఖ్య భారీగా తగ్గడానికి కారణంగా అధ్యాపకులు భావిస్తున్నారు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ముందు జరగడంతో చాలా మంది విద్యార్థులు ఆ కోర్సుల్లో చేరిపోయారు. ఇంటర్‌ ఫలితాలు ఏప్రిల్‌లోనే విడుదల కాగా, ఫస్టియర్‌ అడ్మిషన్లకు జూలైలో నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. అయితే సెప్టెంబరులో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. అప్పటికే అధిక సంఖ్యలో విద్యార్థులు ఇంజినీరింగ్‌, ఇతర కోర్సుల్లో చేరిపోయారు. దీంతో డిగ్రీ ఫస్టియర్‌ అడ్మిషన్ల భర్తీపై తీవ్ర ప్రభావం చూపింది.

డిగ్రీ కోలుకునేనా

విద్యా రంగంలో కాలానుగుణంగా కొన్ని కోర్సులు వెనుకబడి, మళ్లీ పుంజుకోవడం చూస్తుంటాం. కొన్నేళ్లు ఇంజినీరింగ్‌ కోర్సులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాయి. చాలా కళాశాలలు మూతపడ్డాయి. ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బీఈడీ కొన్నేళ్లుగా బాగా వెనుకబడి ఆయా కళాశాలలు మూతపడ్డాయి. ఇటీవల కాలంలో బీఏ, బీకాం, బీఎస్సీ చదువుకున్న విద్యార్థులకు క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఈ కారణంగా రాబోయే రోజుల్లో మళ్లీ మంచి రోజులు వస్తాయని కళాశాలల యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

డిగ్రీతోనే లక్షల్లో ప్యాకేజీలు

డిగ్రీలో 25 కోర్సులు విద్యార్థులు చేరేందుకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బీఎస్సీ కంప్యూటర్‌, ఎంఐ డేటా సైన్స్‌, బీసీఏ కోర్సులు ప్రాధాన్యతగా నిలుస్తున్నాయి. ఇవి చేసిన విద్యార్థులు గడిచిన రెండేళ్లలో రూ.13.5 లక్షలు, రూ.1050 ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారు. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ వంటి కంపెనీల్లో డిగ్రీ విద్యార్థులు క్యాంపస్‌ ఇంటర్వూల ద్వారా ఎంపికవుతు న్నారు. డిగ్రీ విద్యార్థులైతే నిలకడ ఉంటుందన్న ఉద్దేశంతో కొన్ని కంపెనీలు వీరిని ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నారు.

ఏ ప్రభుత్వానికై నా, సంస్థలకై నా, పరిశ్రమలకై నా, ఏ ఇతర విభాగాలకై నా నిపుణులైన కార్మికులు, ఇంజినీర్లు, డాక్టర్లు, సాంకేతిక వర్గాలు ఎంత అవసరమో.. వారి విధి విధానాలను గాడిలో పెడుతూ.. వారి జీత భత్యాలు.. సెలవులు.. అవసరాలు.. ఉద్యోగంలో ఉన్నపుడు.. పదోన్నతులపుడు.. పదవీ విరమణ అనంతర ప్రక్రియలు చూడాల్సిన పాలకవర్గమూ అంతే ముఖ్యం. ఈ బాధ్యతలు నిర్వర్తించడానికి ఇంజినీర్లు, వైద్యులు తదితర వర్గాల వారు ఏ మాత్రం పనికిరారు. ఎవరు చేయాల్సిన పని వారు చేయకుంటే పాలన స్తంభించిపోతుంది. నిజానికి చెప్పాలంటే చాలా మంది ప్రొఫెషనల్‌ కోర్సుల వారికి పలు కార్యాలయాల్లో దరఖాస్తులు ఎలా రాయాలో.. ఎలా పూరించాలో అంత అవగాహన ఉండదు. ఈ పని పూర్తిగా పరిపాలన విభాగం వారి సహకారంతో చేయాల్సిందే. ఇంతటి విలువైన పని చేయాలంటే కచ్చితంగా బ్యాచిలర్‌ డిగ్రీలో ఉత్తీర్ణులైన వారి అవసరం ఎంతైనా ఉంది. ఈ బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులను తక్కువగా చూడడం ఏమాత్రం సమంజసం కాదు. ఎన్ని కంప్యూటర్‌ కోర్సులు, ప్యాకేజీలు, ఏఐలు వచ్చినా డిగ్రీ ఉత్తీర్ణుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నేటి సమాజంలో చాలా చోట్ల మంచి ప్యాకేజీలకే మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి కూడా. ఈ విధంగా ప్రభుత్వ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డిగ్రీతో అవకాశాలు పుష్కలం

ఇంజినీరింగ్‌ కన్నా డిగ్రీతోనే ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తున్నాయి. క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో డిగ్రీ విద్యార్థులు భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ప్రభుత్వపరంగా ఇచ్చే నోటిఫికేషన్లకు డిగ్రీనే ప్రధాన అర్హతగా పేర్కొంటున్నారు. ఈ నెల 20తో ముగుస్తున్న స్పాట్‌ అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోవాలి.

– డాక్టర్‌ కేపీ రాజు, ప్రిన్సిపాల్‌,

డిగ్రీ కళాశాల, కొత్తపేట

డిగ్రీ కళాశాలలో దరఖాస్తులకు ఆహ్వానం

నోటిఫికేషన్‌ విడుదలలో తీవ్ర జాప్యం

ఫలితంగా ఇతర కోర్సుల్లో చేరిన విద్యార్థులు

జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో

39శాతం మాత్రమే చేరికలు

నేటితో ముగియనున్న స్పాట్‌ అడ్మిషన్లు

భవిత నీదే బ్యాచిలర్‌! 1
1/1

భవిత నీదే బ్యాచిలర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement