ఫిలిం ఫెస్టివల్‌ జ్యూరీ మెంబర్‌గా రామదాసు | - | Sakshi
Sakshi News home page

ఫిలిం ఫెస్టివల్‌ జ్యూరీ మెంబర్‌గా రామదాసు

Nov 20 2025 6:40 AM | Updated on Nov 20 2025 6:40 AM

ఫిలిం

ఫిలిం ఫెస్టివల్‌ జ్యూరీ మెంబర్‌గా రామదాసు

కరప: గోవాలో ఈ నెల 20 నుంచి 28వ తేదీ వరకు జరిగే 56వ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా–2025 సెలెక్షన్‌ కమిటీ, జ్యూరీ మెంబర్‌గా కరప మండలం పెనుగుదురుకు చెందిన సినీ, టీవీ సీరియల్స్‌ నిర్మాత, దర్శకుడు నామన రాంబాబు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సమాచార, పౌరసంబంధాల మంతిత్వశాఖ సెక్రటరీ సంతోష్‌కుమార్‌ మౌర్య నుంచి ఉత్వర్వులు వచ్చినట్టు బుధవారం ఆయన విలేకరులకు తెలిపారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 10 నంది అవార్డులు తీసుకున్నారు. 15వ అంతర్జాతీయ చిల్డ్రన్స్‌ ఫిలిం ఫెస్టివల్స్‌లో కూడా జ్యూరీ మెంబర్‌గా వ్యవహరించారు. 2019లో అమరావతిలో జరిగిన షార్ట్‌ ఫిలిం ఫెస్టివల్‌లో జ్యూరీ ఆర్గనైజర్‌గా పాల్గొన్నారు. 2005–2007లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిలిం, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.

అన్నదాత సుఖీభవ

రెండో విడత ప్రారంభం

సామర్లకోట: ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పి.నారాయణ అన్నారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌ పథకం రెండవ విడత ప్రారంభం సందర్భంగా బుధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రెండవ విడతలో జిల్లాలో 1,50, 475 మంది రైతులకు రూ.99.85 కోట్లు అందజేశామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్యక్షత వహించగా కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి, ఎంపీ సానా సతీష్‌బాబు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పేరాబత్తుల రాజశేఖరం పాల్గొన్నారు.

ఐఎంఏ కాకినాడ అధ్యక్షుడిగా

వెంకటరమణ

కాకినాడ క్రైం: ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) కాకినాడ శాఖ అధ్యక్షుడిగా డాక్టర్‌ కాదా వెంకటరమణ, కార్యదర్శిగా డాక్టర్‌ ఎస్‌సీహెచ్‌ఎస్‌ రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం కాకినాడలోని రామ్‌కోశాలో ఏర్పాటు చేసిన సమావేశంలో 2025–27 పదవీ కాలానికి నామినేషన్ల ప్రక్రియ నిర్వహించారు, అనంతరం అభ్యర్థులంతా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ప్రెసిడెంట్‌గా విష్ణు మహేష్‌బాబు, కోశాధికారిగా ఎల్‌ఆర్‌ఎన్‌.నరసింగ్‌రావు పైడికొండల, ఉపాధ్యక్షులుగా జి.కృష్ణవేణి, ఎస్‌.వీరభద్రరావు, త్రిమూర్తుల రాయుడు, ఐఎంఏ ఏఎంఎస్‌ చైర్మన్‌గా ఆర్‌.గౌతమ్‌ ప్రవీణ్‌, సెక్రటరీగా పివి.నిశాంత్‌, ఐఎంఏ సీజీపీ చైర్మన్‌గా కె.శైలజ, సెక్రటరీగా పి.జానకీ, ఏఎంఏ మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా జి.సత్యవతి, ఏ.మాధవి, జేడీఎన్‌ చైర్మన్‌గా తొండూరు పీఎన్‌ఎస్‌ఆర్‌ అభిలాష్‌, ఎంఎస్‌ఎన్‌ చైర్మన్‌గా ముద్దా రాజేష్‌ ఎన్నికయ్యారు. ఎలక్షన్‌ ఆఫీసర్‌గా డాక్టర్‌ జీఎస్‌ మూర్తి వ్యవహరించారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు

అద్దరిపేట విద్యార్థి ఎంపిక

తొండంగి: రాష్ట్ర స్థాయి పరుగుపందెం పోటీలకు మండలంలోని అద్దరిపేట జిల్లా పరిషత్‌ హైస్కూలు విద్యార్థి ఎంపికై నట్టు ఆ పాఠశాల హెచ్‌.ఎం.దుర్గా కుమారి తెలిపారు. తమ పాఠశాలలో పదవతరగతి చదువుతున్న పిక్కి జగదీష్‌ ఈనెల 18న కాకినాడలో జిల్లా స్థాయిలో జరిగిన పరుగు పందెం పోటీల్లో ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. త్వరలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా జగదీష్‌ను, శిక్షణ ఇచ్చిన పీఈటీ ఉపాధ్యాయుడు మునకోటి దుర్గా ప్రసాద్‌ను ఉపాధ్యాయ బృందం, గ్రామపెద్దలు అభినందించారు.

ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు రేపు

కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్‌లోని డైస్‌ సెంటర్‌లో 0–18 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకు ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలను శుక్రవారం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరసింహ నాయక్‌ బుధవారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడకు చెందిన ఇండో బ్రిటీష్‌ హాస్పిటల్‌ సౌజన్యంతో రాష్ట్ర బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎస్‌కే)లో భాగంగా ఈ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గుండె వ్యాఽధి నిర్ధారణ అయిన పిల్లలకు ఇండో బ్రిటీష్‌ హాస్పిటల్‌లో ఉచిత శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలకు చెందిన వైద్యాధికారులు అనుమానిత పిల్లలను గుర్తించి శిబిరానికి సిఫార్సు చేయాలని ఆయన సూచించారు.

ఫిలిం ఫెస్టివల్‌ జ్యూరీ  మెంబర్‌గా రామదాసు 1
1/1

ఫిలిం ఫెస్టివల్‌ జ్యూరీ మెంబర్‌గా రామదాసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement