క్వారీ నిర్వహణపై ప్రజాభిప్రాయ సేకరణ
రౌతులపూడి: మండలంలోని ఎస్.పైడిపాలలో ఉన్న నల్లరాయి క్వారీ నిర్వహణపై బుధవారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎస్.పైడిపాల సర్వే నంబర్ 15లో 1.735 హెక్టార్లు, ములగపూడి సర్వే నంబర్ 1పీలో 0.858హెక్టార్లు, డి.పైడిపాల సర్వే నంబర్ 59పీలో 0.507 హెక్టార్లు, మొత్తం 3.1 హెక్టార్లు, ఎస్.పైడిపాల 15పీలో 3.44హెక్టార్లు, మల్లంపేట సర్వేనంబర్ 90లో 2.5 హెక్టార్లు నల్లరాయి క్వారీ నిర్వహణకు ఎస్‌కే టెర్రా మైన్స్ అండ్ మినరల్స్ ఎల్‌ఎల్‌పీ పేరుతో కృష్ణా జిల్లాకు చెందిన బట్లంక స్వామి కిరణ్‌పాల్ దరఖాస్తు చేసుకున్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎంబీఎస్.శంకర్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం పెద్దాపురం ఆర్డీఓ కె.శ్రీరమణి పర్యవేక్షణలో జరిగింది. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎన్జీవోలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలుగకుండా, ప్రజలు ఇళ్లు దెబ్బతినకుండా నైపుణ్యత, నిర్దేశిత ప్రమాణాలు కలిగి వారితో బ్లాస్టింగ్ చేపట్టాలని, స్థానికులకు ఉపాధి, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రతిపాధిత క్వారీ ప్రాంతంలో ఉన్న సాగు భూములకు ఎలాంటి నష్టం జరగుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్వారీయింగ్ చేస్తామని యాజమాన్యాలు హామీ ఇచ్చారు. సంబంధిత నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, తహసీల్దారు, ఎస్‌వీ.నరేష్, ఎస్‌ఐ బి.వెంకటేశ్వరరావు, ఎన్విరానిమెంట్ ఆర్‌ఐ పట్నాయక్, వీఆర్‌ఓలు చందు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


