రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయానికి బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయడంతో ఆలయ ప్రాంగణం కిట కిట లాడింది. స్వామివారి ఆలయంతో బాటు వ్రత మండపాలు, క్యూ లు భక్తులతో నిండిపోయాయి. సత్యదేవుని ఆలయాన్ని బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు తెరచి పూజలు చేశారు. అనంతరం వ్రతాల నిర్వహణ ప్రారంభించారు. అదే సమయం నుంచి స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. సుమారు 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించగా స్వామివారి వ్రతాలు 3,400 జరిగాయి. దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు.


