కలసి రాని ఖరీఫ్‌ | - | Sakshi
Sakshi News home page

కలసి రాని ఖరీఫ్‌

Nov 19 2025 6:17 AM | Updated on Nov 19 2025 6:17 AM

కలసి

కలసి రాని ఖరీఫ్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మోంథా తుపాను విరుచుకుపడింది. చివరి దశలో ఉన్న వరి పంటను నిండా ముంచేసింది. రైతులను ఆర్థికంగా కోలుకోలేని రీతిలో దెబ్బ తీసింది. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకూ చిల్లిగవ్వ సహాయం కూడా అందలేదు. గత వైఎస్సార్‌ సీపీ పాలనలో ప్రభుత్వమే ఉచిత పంటల బీమా చేయించడంతో పంట నష్టం జరిగినా ఇన్‌పుట్‌ సబ్సిడీతో రైతుకు భరోసా లభించేది. చంద్రబాబు ప్రభుత్వం ఉచిత పంటల బీమాను ఎత్తివేయడంతో జిల్లాలోని 60 శాతం మంది ఈ పథకానికి దూరమయ్యారు. తుపానుతో నష్టపోయారు. అంతా బాగుంటే 35 నుంచి 40 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. ఆ అంచనాలు కాస్తా తలకిందులయ్యాయి. పోయిన పంట ఎలాగూ పోయింది.. కనీసం మిగిలినదైనా ఒబ్బిడి చేసుకుని ఉన్నంతలో గట్టెక్కుదామనుకున్నా.. ప్రభుత్వ ‘మద్దతు’ ఏమాత్రం లభించడం లేదు. దీంతో, పెట్టుబడి కూడా రాని దుస్థితిని ఖరీఫ్‌ రైతులు ఎదుర్కొంటున్నారు. తీవ్రంగా నష్టపోతున్న తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. కాకినాడ రూరల్‌, కరప, పెద్దాపురం, సామర్లకోట, ప్రత్తిపాడు రూరల్‌, ఏలేశ్వరం, గండేపల్లి, తుని, తొండంగి, జగ్గంపేట తదితర మండలాల్లో ప్రస్తుతం వరి కోతలు, మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆయా మండలాల్లోని ప్రధాన రహదారులు, కళ్లాల్లో రైతులు ధాన్యాన్ని బరకాలపై ఆరబెట్టి తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ని‘బంధనాల’ బాధలు

జిల్లావ్యాప్తంగా 80 శాతం ఆయకట్టులో రైతులు ఖరీఫ్‌లో సన్న వరి రకాలనే సాగు చేశారు. పంట కోతకు వచ్చేనాటికి ఎకరానికి తక్కువలో తక్కువ రూ.36 వేల వరకూ పెట్టుబడి పెట్టారు. పంట కలిసొస్తుందనే ఉద్దేశంతో దొరికిన చోటల్లా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. తీరా పంట చేతికందే దశలో తుపాను విరుచుకుపడింది. ఇప్పుడేమో ఎకరానికి 25 బస్తాలకు మించి దిగుబడి రావడం లేదు. ప్రభుత్వ ని‘బంధనాల’తో తడిసి, రంగు మారిన అమ్ముకోలేక రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. గ్రేడ్‌–1 రకం ధాన్యానికి 75 కేజీల బస్తాకు రూ.1,792, సాధారణ రకానికి రూ.1,777 చొప్పున ప్రభుత్వం కనీస మద్దతు ప్రకటించింది. కానీ, తేమ శాతం నిబంధనల సాకుతో ఆ ధర ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. కొనుగోలు కేంద్రాల్లో సవాలక్ష కొర్రీలు వేస్తున్నారు. పైగా ప్రభుత్వం నుంచి ధాన్యం సొమ్ము రావడానికి చాలా రోజులు పడుతోంది. పైగా తేమ శాతం తగ్గాలంటే ధాన్యం ఆరబెట్టాలి. దీనికిగాను బరకాలకు, ఇద్దరు ముగ్గురు కూలీలకు కలిపి రోజుకు రూ.2 వేలు అవుతోంది. ఈ బాధలు భరించలేక, మరో గత్యంతరం లేక రైతులు కళ్లాల్లోనే ధాన్యాన్ని బస్తాకు రూ.300 తక్కువకై నా దళారులకు అమ్మేస్తున్నారు. బస్తా ధాన్యాన్ని రూ.1,480 నుంచి రూ.1,500కే కమీషన్‌ ఏజెంట్లకు దళారులకు అమ్ముకుంటూ నష్టపోతున్నారు. విచిత్రమేమిటంటే కమీషన్‌ ఏజెంట్లు, దళారులు కూడా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైతుల కళ్లాల్లోనే ఎండబెట్టుకుంటున్నారు.

ఎకరాకు రూ.10 వేలు కూడా రాలేదు

ఈ ఏడాది ఐదెకరాల్లో వరి సాగు చేశాను. గతంకన్నా పెట్టుబడి అదనంగా అయింది. అనుకున్న స్థాయిలో దిగుబడి రాలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ధాన్యాన్ని విక్రయిస్తే పెట్టుబడి కూడా రాని పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఎకరాకు రూ.10 వేలు కూడా గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. ధరను పెంచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – చిటికిరెడ్డి ఏసుబాబు, రైతు, ఏలూరు,

ప్రత్తిపాడు మండలం

పెట్టుబడి కూడా దక్కడం లేదు

నేను ఎనిమిదెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాను. ఎకరాకు రూ.40 వేల వరకూ పెట్టుబడి అయ్యింది. రైతుకు ఎకరాకు 15 బస్తాల కౌలు ఇవ్వాలి. మూడెకరాల్లో కోతలు కోశాం. తుపాను ప్రభావంతో చేలు పడిపోవడంతో దిగుబడి 25 బస్తాలు మించేలా లేదు. పక్క గ్రామాల్లో బస్తా ధాన్యం రూ.1,500కు కొనుగోలు చేస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. దిగుబడి, ధర లేక కౌలు రైతులు, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెట్టుబడి కూడా దక్కడం లేదు. – దామలంక సతీష్‌,

కౌలు రైతు, కొవ్వూరు, కాకినాడ రూరల్‌

పెట్టుబడి పెరిగిపోయింది

ఐదెకరాల్లో వరి సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలకు పైగా ఖర్చయింది. ఎకరాకు 30 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చింది. 75 కేజీల బస్తా రూ.1,480కే అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది తుపానుతో వరి పంట నేలకొరిగి, దిగుబడి తగ్గడమే కాకుండా, మరో రూ.5 వేలు అదనంగా ఖర్చయింది. ఎకరాకు రూ.10 వేలు నష్టపోయాను. సకాలంలో ఎరువులు దొరకకపోవడం, అసలు కన్నా అదనంగా సొమ్ము వెచ్చించి ఎరువులను కొనుగోలు చేయడంతో పెట్టుబడి పెరిగిపోయింది.

– ఏపూరి వెంకట రమణ, రైతు, చినశంకర్లపూడి, ప్రత్తిపాడు మండలం

జిల్లాలో ఖరీఫ్‌ సాగు వివరాలు

వరి సాగు విస్తీర్ణం 2,12,000 ఎకరాలు

కోతలు పూర్తయినవి 21,000

ధాన్యం కొనుగోలు కేంద్రాలు 293

ఉత్పత్తి అంచనా 6,00,000 మెట్రిక్‌ టన్నులు

ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం3,00,000 మెట్రిక్‌ టన్నులు

ఫ ‘మోంథా’తో తీరని నష్టం

ఫ పడిపోయిన దిగుబడులు

ఫ కానరాని ప్రభుత్వ ‘మద్దతు’

ఫ గత్యంతరం లేక దళారులకే అమ్ముకుంటున్న రైతులు

ఫ పెట్టుబడులు కూడా రావడం లేదని గగ్గోలు

కలసి రాని ఖరీఫ్‌ 1
1/4

కలసి రాని ఖరీఫ్‌

కలసి రాని ఖరీఫ్‌ 2
2/4

కలసి రాని ఖరీఫ్‌

కలసి రాని ఖరీఫ్‌ 3
3/4

కలసి రాని ఖరీఫ్‌

కలసి రాని ఖరీఫ్‌ 4
4/4

కలసి రాని ఖరీఫ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement