ప్రైవేటు ఆస్పత్రులపై ఆకస్మిక దాడులు
తుని: పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) నరసింహ నాయక్ పర్యవేక్షణలో ఆస్పత్రులు, ల్యాబ్‌లలో రికార్డులను పరిశీలించారు. శ్రీలక్ష్మీ జనరల్ ఆస్పత్రి, అంకారెడ్డి డెంటల్ క్లినిక్, దుర్గాప్రసాద్ డయాబెటిక్ కేర్ సెంటర్, లీలా నర్సింగ్ హోమ్, సురేష్ ఆస్పత్రి, రవితేజ క్లినికల్ ల్యాబ్‌లలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ నరసింహ నాయక్ మాట్లాడుతూ, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న జ్యోతి డయోగ్నోస్టిక్స్ సెంటర్‌ను సీజ్ చేశామని తెలిపారు. లైసెన్సులు ఉన్నా రెన్యువల్ చేసుకోకుండా పలు ఆస్పత్రులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, వారికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. రిజిస్టేషన్లు సకాలంలో రెన్యువల్ చేయించుకోకపోతే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ధరల పట్టిక, సేవలు, వైద్యుల వివరాలను నోటీసు బోర్డులో విధిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అనుమతులు తీసుకున్న ప్రాంతంలోనే ఆస్పత్రులు, ల్యాబ్‌లు నడపాలని స్పష్టం చేశారు.
వీరేశ్వరునికి రజత సర్పాభరణం
ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి వారికి కూసంపూడి సతీష్‌వర్మ దంపతులు మంగళవారం రజత సర్పాభరణాన్ని సమర్పించారు. సంప్రోక్షణ అనంతరం స్వామివారికి అర్చకుడు పేటేటి శ్యామల కుమార్ సర్పాభరణాన్ని అలంకరించారు.
వేద విద్యా గురుకులానికి భారతాత్మ పురస్కారం
రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరులోని శ్రీ దత్తాత్రేయ వేద విద్యా గురుకులానికి సింఘాల్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక భారతాత్మ నగదు పురస్కారం అందించింది. ఈ పురస్కారం కింద రూ.7 లక్షల చెక్కు, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేశారు. గురుకులం వ్యవస్థాపకుడు, ప్రధానాచార్యులు వేదార్థ చూడామణి, ఘన సమ్రాట్ గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి తరఫున గుళ్లపల్లి లక్ష్మీనారాయణ దత్తాత్రేయ ఘనపాఠి, పైడిమర్రి చంద్రశేఖర ఘనపాఠి ఈ విశిష్ట పురస్కారాన్ని పుణేలో గోవింద దేవ గిరీజీ, ఆచార్య స్వామి ప్రద్యుమ్న చేతుల మీదుగా ఇటీవల అందుకున్నారు. అక్కడి నుంచి మంగళవారం వచ్చిన వారిద్దరూ అక్కడ స్వీకరించిన చెక్కు, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలను గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనపాఠి, గురుకుల కార్యదర్శి డాక్టర్ టీవీ నారాయణరావులకు సమర్పించారు. పుణె నుంచి వచ్చిన ఇద్దరికీ గురుకులంలో కమిటీ సభ్యులు, శిష్యబృందం ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీతారామచంద్ర ఘనపాఠి మాట్లాడుతూ, విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) పూర్వ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ పేరిట ఏర్పాటు చేసిన సింఘాల్ ఫౌండేషన్ తరఫున 2022లో ఉత్తమ వేద అధ్యాపకునిగా భారతాత్మ పురస్కారం స్వీకరించడం, ఇప్పుడు సర్వశ్రేష్ట గురుకులంగా పురస్కారం లభించడం దత్తాత్రేయ స్వామి అనుగ్రహమని అన్నారు. దేశంలో వందల సంవత్సరాల నుంచి ఎన్నో వేద పాఠశాలలు నడుస్తూండగా కేవలం 25 సంవత్సరాల నుంచి నడుస్తున్న తమ గురుకులానికి ప్రతిష్టాత్మక భారతాత్మ పురస్కారం రావడం ఆనందంగా ఉందని చెప్పారు. 2027 గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఆ పానవ నదీ తీరంలోని గురుకులానికి పురస్కారం రావడం దైవానుగ్రహమని అభివర్ణించారు. గుళ్లపల్లి ఆంజనేయ ఘనపాఠి దివ్యాశీస్సులు, గురుకుల ఉన్నతికి తోడ్పాటు అందిస్తున్న కమిటీ సభ్యులు, వదాన్యుల సహకారం, అధ్యాపకుల పరిశ్రమ, క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల కారణంగానే ఈ విశిష్ట పురస్కారం వచ్చినట్లు భావిస్తున్నట్లు తెలిపారు.
ఫ పత్రాలు లేకుండానే ల్యాబ్ నిర్వహణ
ఫ సీజ్ చేసిన డీఎంహెచ్‌ఓ
ప్రైవేటు ఆస్పత్రులపై ఆకస్మిక దాడులు


